Sunday, January 19, 2025
HomeTrending Newsబీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌ - నాందేడ్ రైతులతో ఇంద్రకరణ్

బీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌ – నాందేడ్ రైతులతో ఇంద్రకరణ్

భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలన్ని దేశమంతటా అమలవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌లో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పొరుగు రాష్ట్రమైన‌ మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లా బోక‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో కిని గ్రామంలో ప‌ర్య‌టించారు. రైతులు, వివిధ వర్గాల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. సీయం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే కనీవిని ఎరుగనిరీతిలో అభివృద్ధి చేశార‌ని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దేశ ప్రజలందరికీ ఈ పథకాలు అమలు చేసి అన్ని రంగాల్లో భారత దేశాన్ని అభివృద్ధి పరచాలని కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారన్నారు. సీయం కేసీఆర్ త్వ‌ర‌లోనే నాందేడ్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నామ‌ని, రైతు మరణించినా.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా పరిహారం అందుతున్నదని వివరించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. తాగునీరు, సాగునీరు, ఆస‌రా ఫించ‌న్లు, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, కార్పోరేట్ స్థాయిలో విద్యా, వైద్యం లాంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని వారికి వివ‌రించారు. హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి సాధిస్తున్నద‌ని, ఐటీ, ఫార్మా ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు పెరిగాయ‌న్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు బీఆర్ఎస్, దాని మిత్రప‌క్షాలే ప్రత్యామ్నాయమ‌ని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలన చూసిన ప్రజలు బీఆర్‌ఎస్ త‌ర‌హా పాల‌న‌ను కోరుకుంటున్నార‌ని పేర్కొన్నారు. దేశంలో పుష్క‌లంగా స‌హాజ వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికి అనుకున్న స్థాయిలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని చెప్పారు. బీజేపీ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. మ‌హారాష్ట్ర‌లో ఊరూరా బీఆర్‌ఎస్‌ విస్తరిస్తామ‌ని త్వరలో ప్రతీ జిల్లాలో తాలూకా, గ్రామస్థాయి వరకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మ‌హారాష్ట్ర‌ ప్ర‌జ‌లు కూడా బీఆర్ఎస్ ను ఆశీర్వ‌దించి, ఆద‌రించాల‌ని కోరారు. అంద‌కుముందు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ పాల‌జ్ క‌ర్ర వినాకున్ని ద‌ర్శించుకుని , ప్ర‌త్యేక పూజలు చేశారు. నాందేడ్ జిల్లాకు చెందిన ప్ర‌ముఖ నాయ‌కులు ర‌మేష్ రాథోడ్, సునీల్ కుమార్ బ‌జాజ్, ఆశోక్ రాథోడ్, ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన అనేక మంది ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ కు మ‌ద్ధ‌తు తెలిపారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంట ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్