మూడేళ్ల కాలంలోనే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకు వెళుతోందని, కానీ ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నాయని కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో నీటి వసతి పనులకు బుగ్గన శంకుస్థాపన చేశారు. ఎగుమతులలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకిందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్ళుగా అగ్రస్థానంలోనే కొనసాగుతోందని చెప్పారు. హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ని మంజూరు చేయించిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ కృషికి ఇది నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసినా రాష్ట్ర ప్రయోజనాలకోసం చేసిందేమీ లేదని విమర్శించారు.
ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని, 57 కి.మీ పైపులైన్ ద్వారా ముచ్చుమర్రి నుంచి ఓఎమ్ఐహెచ్ కు నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. రోజుకు సుమారు 400 ట్యాంకుల నీరు పరిశ్రమలకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విశాఖ, చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని బుగ్గన వివరించారు.
బుగ్గన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- అరటితోటల మధ్యలో పరిశ్రమలు, అద్దె షూట్ లతో పెట్టుబడులంటూ గత ప్రభుత్వ ప్రచారం చేసుకుంది. గత ప్రభుత్వానిది ఆర్భాటపు ప్రచారం
- విమర్శలకు ధీటుగా నిశ్శబ్దంగా అభివృద్ధి చేసుకుంటూ పోవడమే మా విధానం
- గతంలో ఉయ్యాలవాడ ఎయిర్ పోర్ట్ ఏమీ లేకుండానే ప్రారంభించారు
- సోమవారం పోలవరం అని ప్రచారం చేసుకున్నారు, వాస్తవానికి జరిగింది శూన్యం
- ప్రతి జిల్లాలో పారిశ్రామికవేత్తలతో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తాం
- పారిశ్రామికవేత్తలకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదన్నదే అంతిమ లక్ష్యం
- రూ.80 కోట్లతో కర్నూలుకి సుంకేశుల ద్వారా నీరు
- త్వరలోనే అనుమతుల అనంతరం కర్నూలుకి హైకోర్టు
- సీఎం జగన్ నాయకత్వంలో అన్ని రంగాలలో ప్రగతి
- అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం
- యువత, ప్రజలకు , అక్ష్యరాస్యులకు మీడియా ద్వారా తెలియవలసిన వాస్తవాలివి
- మల్లికార్జున రిజర్వాయర్ పై ముఖ్యమంత్రితో సంప్రదించి నిర్ణయం
- సాగు రైతులకు చట్టపరంగా న్యాయం
- ఏడాదిలోగా ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ పార్కుకు నీరు అందిస్తాం