రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వృద్ధిరేట్లపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. ప్రతిపక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా యనమల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయరంగ వృద్ధి రేటు దాచిపెట్టి, వారికి కావాల్సిన లెక్కలను మాత్రమే చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఆర్థిక వ్యవస్థలో నిజమైన (Real) వృద్ధిని అంచనావేయడం కోసం స్థిరమైన ధరలను (Constant prices) ఉపయోగిస్తారని, కేవలం ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుజేయడానికే విపక్ష టిడిపి నేతలు ప్రస్తుత ధరల(GSDP at Current Prices) పై వృద్ధి రేట్లు చెబుతున్నారని బుగ్గన వెల్లడించారు.
వ్యవసాయ రంగ అభివృద్ధి రేటును తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయరంగాన్ని ఏ విధంగా హేళన చేశారో, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే ధోరణితో మన రాష్ట్రానికి జీవనాధారమైన వ్యవసాయరంగ వృద్ధిరేటును దాచిపెట్టి రైతన్నను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న యనమల కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్ధిక వృద్ధి మందగమనంలో ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 2019-20లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం రంగంలో 7.91%, పారిశ్రామికరంగంలో 10.24%, సేవారంగంలో 6.20% వృద్ధితో అంచనాలకు మించి పనితీరును కనబరిచామని గణాంకాలతో వివరించారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020-21లో ప్రపంచ, దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తి భారీగా పతనమైందని, అదే కోవలో 2020-21లో మన రాష్ట్ర ఆర్ధిక స్థితి కూడా బాగా దెబ్బతిన్నదని బుగ్గన పేర్కొన్నారు.
మన రాష్ట్రంలో 6.5% నిరుద్యోగ రేటు అని చెప్పడం కూడా అవాస్తవమేనని బుగ్గన తెలిపారు. కేంద్ర సర్వే సంస్థ లెక్కల ప్రకారం మన రాష్ట్ర నిరుద్యోగ రేటు (15-59 సం:) 2018-19లో 5.7% ఉంటే, 2019 -20లో 5.1%కి తగ్గింది. ఏ లెక్కల ప్రకారం 6.5% అని చెప్పారని బుగ్గన నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను తప్పు దారి పట్టించి రాజకీయంగా లబ్ధిపొందేందుకు ఎలాంటి కుట్రలు చేయడం దురదృష్టకరమన్నారు.
అలాగే మన రాష్ట్రంలో ఆర్ధిక అసమానత 32% నుండి 43%కి పెరిగిందని యనమల చెప్పిన గణాంకాలపై కూడా బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు చెబుతున్న సంఖ్యలు, లెక్కలకు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక పత్రికా ప్రకటన ఇచ్చి, దానిని మీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం తగదని యనమలకు హితవు పలికారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కనీస నైతిక విలువలను మరచి తప్పుడు లెక్కలు, అంకెలతో అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయాలనుకోవడం బాధాకరమన్నారు బుగ్గన. ఇప్పటికైనా ప్రతి పక్ష నాయకులు ప్రజలకు నిజాలు చెప్పి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు.