Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు పాటపై పరుచుకున్న పరిమళం- సినారె

తెలుగు పాటపై పరుచుకున్న పరిమళం- సినారె

(జూన్ 12, సినారె వర్ధంతి – ప్రత్యేకం)

C. Narayana Reddy :

తెలుగు సినిమా సాంకేతిక పరంగా .. కథాకథనాల పరంగా కొత్త మార్పులను అన్వేషిస్తూ పరుగులు తీసినట్టుగానే, తెలుగు పాట కూడా కొత్త అందాలను సంతరించుకుంటూ ఉరకలు వేసింది. పంట చేలల్లో .. పడుచు ఊహల్లో విహంగమై విహరించింది. శ్రీశ్రీ .. దేవులపల్లి కృష్ణశాస్త్రి .. దాశరథి కృష్ణమాచార్యులు .. ఆరుద్ర వంటి కవులు పాటలు రాయడం వలన, ఆ కలాల నుంచి జాలువారిన పాటలు కాలప్రవాహంలో కొట్టుకుపోలేదు. మనసు తలుపులకు తట్టుకుని తరతరాలుగా అలా ఉండిపోయాయి అంతే.

సాధారణంగా కవులు ఉపయోగించే పాటలకు పదునెక్కువ .. భావాల బరువు ఎక్కువ. అర్థాల పరంగా చూసుకుంటే వాటి లోతు అందరికీ అందదు .. ఎత్తు ఎన్నటికీ తెలియదు. అలా తన కవితా ధారలచే సాహిత్య ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సినారె కూడా, కవిత్వపు అడుగు జాడల్లోనే .. తేలికైన పదాల అల్లికతోనే పాటను నడిపించారు .. ప్రతిపాటను అక్షరాల ఆయుధంగా ప్రయోగించారు. పాటకు కొత్త సొగసులు అద్ది పావురంలా అనుభూతుల ఆకాశంలో ఎగరేశారు. ఆ పాటలను పంచుకుని మేఘాలు కూడా రాగాలు తీశాయంటే అతిశయోక్తి కాదేమో.

సినారె పూర్తి పేరు .. సింగిరెడ్డి నారాయణ రెడ్డి ( C. Narayana Reddy ) . పిలవడానికి తేలికగా ఉంటుందని ఆయన సినారె అని పెట్టుకున్నారు. ఈ మూడు అక్షరాల్లోనే ఆయన అపారమైన కీర్తి ప్రతిష్ఠలు ఇష్టంగా ఇమిడిపోయాయి. కరీంనగర్ జిల్లా .. ‘హనుమాజీ పేట’లో జన్మించిన సినారెకి, మొదటి నుంచి కూడా సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. ఆ అభిరుచి ఆయనకి ‘ఆచార్య’ పదవిని అప్పగించింది. విద్యార్ధి దశ నుంచే ఆయన నాటకాలు రాస్తుండేవారు. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రయాణం, తెలుగు సాహిత్యంలోని అన్నిరకాల ప్రక్రియలను పలకరిస్తూ వెళ్లింది.

అచ్చతెలుగు పంచెకట్టుతో ఆయన మూర్తీభవించిన తెలుగుదనంలా ఉండేవారు. విశాలమైన కళ్లు .. ఆయనలోని కవితా సరస్వతికి అద్దం పడుతున్నట్టుగా ఉండేవి. ఆయన నడక కవిరాజులా గంభీరంగా సాగేది. అపారమైన పాండిత్యానికీ .. అలసట ఎరుగని కవిత్వానికి అసలైన రూపంలా ఆయన కనిపించేవారు. “పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు .. కండువాలేనిదే గడపదాటనివాడు .. పంచభక్ష్యాలు తమ కంచాన వడ్డింప .. గోంగూర కోసమై గుటకలేసేవాడు .. ఎవడయ్య ఎవడువాడు .. ఇంకెవడయ్య తెలుగువాడు” అంటూ ఆయనకన్నా గొప్పగా తెలుగువారి గురించి ఎవరు చెప్పగలరు?

సినారె వారి సాహిత్యంలోని సౌరభాలను గురించి తెలిసి ఎన్టీఆర్ ఆయనను పిలిపించారు. ‘గులేబకావళి కథ’ సినిమాలో పాటలు రాసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆ సినిమా కోసం ఆయన మొదటిసారిగా ‘నన్ను దోచుకుందువటే ..’ పాటను రాశారు. అప్పటికీ .. ఇప్పటికి తెలుగువారు తమ మనసు గదిలో భద్రంగా దాచుకున్న మధురమైన గీతాల్లో  ఇది  ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాటలో ‘కలకాలము వీడని సంకెలలు వేసినావు’ ..  ‘వెలసినావు నాలో .. నే కలిసిపోదు నీలో’ వంటి తేలికైన పదాలతో అందంగా ఆయన ఆవిష్కరించిన భావజాలం, అణువణువును అలుముకుంటుంది.

ప్రేమ .. విరహం .. వియోగం .. ఆర్తి .. ఆవేదన .. బంధం .. స్నేహం .. ఇలా ఆయన పాట అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ సాగింది. మనసు కలశాలను మకరందంతో నింపింది. ‘అమ్మను మించి దైవమున్నదా'(20వ శతాబ్దం) .. ‘ఓ నాన్న నీ మనసే వెన్న’ (ధర్మదాత) పాటలు తల్లిదండ్రుల ప్రేమలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తాయి. ‘అన్నయ్య సన్నిధి ..’ (బంగారు గాజులు) పాట అన్నా చెల్లెళ్ల అనురాగానికి అద్దం పడుతుంది. ‘గున్నమామిడీ కొమ్మమీద .. (బాలమిత్రుల కథ) లోని పాట స్నేహంలోని మాధుర్యాన్ని గుర్తుచేస్తుంది. ‘వస్తాడు నా రాజు .. ఈ రోజు’ (అల్లూరి సీతారామరాజు) లోని పాట నిరీక్షణలోని  ఆనందాన్ని గుమ్మరిస్తుంది.

‘శివరంజనీ .. నవరాగిని (తూర్పు పడమర) ‘అభినవ తారవో .. నా అభిమాన తారవో'(శివరంజని) పాటలు వింటున్నప్పుడు, పదాలు ఒక ప్రవాహంలా వచ్చి చేరుతున్న తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. సందర్భాన్ని బట్టి ఆయన ప్రయోగించే పదాల తీవ్రత .. భావాల ఉద్ధృతి విస్మయులను చేస్తుంది. అదే సరస శృంగారగీతాల దగ్గరికి వచ్చేసరికి, గుసగుసలాడుతున్నట్టుగా .. ముచ్చటైన మాటలతో ముచ్చట్లాడుతున్నట్టుగా పాటలు రాయడం కూడా ఆయన కలానికి తెలుసు. పూతరేకు విప్పినంత సుళువుగా అర్థాలను పలికించడం తెలుసు .. గుండె గదుల్లో అనుభూతులను ఒలికించడం తెలుసు.

తెలుగు సాహిత్యంలో ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ .. ఎన్నటికి చెరిగిపోదు. ఆయన కలం నుంచి ప్రభవించిన .. ప్రవహించిన సాహిత్యం .. సుగంధాలను వెదజల్లుతూనే ఉంటుంది. ఆయన రచించిన ‘మంటలు – మానవుడు’ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును అందజేస్తే, ‘విశ్వంభర’ ఆయనకి జ్ఞానపీఠ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఎన్నో పదవులను అలంకరించిన ఆయన, సాహిత్య ప్రపంచాన తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. ఆయన చేసిన కృషికి గాను ‘పద్మశ్రీ’ .. ‘పద్మభూషణ్’ పలకరించాయి.

సినారె ఓ అనంతమైన ఆకాశం .. మెరిసే నక్షత్రాలన్నీ ఆయన కవిత్వంలోని అక్షరాలే! సినారె ఓ మహాసముద్రం .. ఎగసిపడే కెరటాలన్నీ ఆయన కావ్యమాలికలే!!  ఆయన కవితా రీతులను గురించి .. ఆయన సాహిత్య సంపదను గురించి ముచ్చటించడానికి కూడా అపారమైన జ్ఞానం కావాలి .. అందుకు అమ్మవారి అనుగ్రహమే కావాలి. లేదంటే అంతకు మించిన సాహసం మరొకటి ఉండదు. తెలుగు సాహిత్యానికి వెలుగు పీఠమై నిలిచిన ఆ కవిరాజు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆ కృషి రుషిని మనసారా స్మరించుకుందాం! ఆయన పుస్తకాల్లోని పుణ్య తీర్థాన్ని తలపై చల్లుకుందాం!

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read : ‘పవర్ ఫుల్’ రోల్స్ కి కేరాఫ్ … బాలకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్