Sunday, January 19, 2025
HomeTrending News"స్కిల్‌" స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ -సజ్జల

“స్కిల్‌” స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ -సజ్జల

కర్నూలు వెళ్ళి అమరావతినే కోరుకుంటున్నారనడం బాబు అహంకారానికి నిదర్శనమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. “స్కిల్‌” స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించిందన్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద  ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

స్కిల్‌ స్కామ్‌లో పెద్దలకు ప్రమేయం:
స్కిల్‌ డెవలప్ మెంటు స్కామ్‌లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఆ విషయాన్ని గుర్తించింది. ఇందులో మా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. నిన్న మార్గదర్శి చిట్‌ఫండ్‌పై రామోజీరావు ప్రకటన ఆశ్చర్యకరం. వారు చట్టానికి అతీతులు అన్నట్లు చెప్పుకొచ్చారు.
స్కిల్‌ స్కామ్‌లో వారి ప్రమేయం బట్టబయలు కావడంతో, దాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ స్వయంగా బయట పెట్టడంతో, చంద్రబాబు, ఆయన కుమారుడు కిక్కురుమనడం లేదు. లేకపోతే పొలిటికల్‌ వెండెట్టా అని విమర్శించే వారు.
స్కిల్‌ స్కామ్‌లో ఆధారాలు దొరికాయి. కాబట్టి ఈడీ తన పని తాను చేసుకుపోతుంది. పెద్దల సహకారం, ఆశీస్సులు లేకుండా అంత పెద్ద స్కామ్‌ సాధ్యం కాదు. కాబట్టే చంద్రబాబు, ఆయన కుమారుడి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయి.

అందుకే రాయలసీమ గర్జన:
ప్రజల ఆకాక్షంలకు అనుగుణంగా రాయలసీమ గర్జన జరుగుతోంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడం కోసం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే కుట్రలు ఎదుర్కోవడం కోసం ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవల చంద్రబాబ కర్నూలులో పర్యటించి, రాయలసీమ వాసులెవరూ పరిపాలన వికేంద్రీకరణ కోరుకోవడం లేదని చెప్పడం.. ఆ తర్వాత ఎల్లో మీడియాలు కధనాలు సరేసరి. చంద్రబాబు మాటలు, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయడం కోసం ఇవాళ కర్నూలులో పెద్దఎత్తున గర్జన చేపట్టారు.

ఆ మాటలు అహంకారానికి నిదర్శనం:
కర్నూలు వాసులు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారన్న చంద్రబాబు మాటలు ఆయన అహంకారం, లేదా ఆ ప్రాంతంపై ఆయనకున్న చిన్నచూపు చూపుతోంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ కర్నూలు గర్జన నిర్వహిస్తుంటే, వారి ఆకాంక్షే మా పార్టీ ఉద్దేశం కాబట్టి సమర్థిస్తున్నాం.
కానీ ఇవాళ ఈనాడు పత్రిక చూస్తే.. ఆశ్చర్యం కలుగుతోంది. సీమకు ఏం చేశారని ఎదురు ప్రశ్న వేశారు. ఇవాళే ఎందుకు రాశారంటే, కర్నూలులో గర్జన సభ ఉంది కాబట్టి. ఆ విధంగా వైయస్సార్‌సీపీని బోనులో నిలబెట్టాలన్నది ఈనాడు, ఇతర ఎల్లో మీడియా ప్రయత్నం. వారి కుట్రలు తెలుసు కాబట్టి, ప్రజలు నమ్మరు.

సీమకు చంద్రబాబు అన్యాయం:
రాయలసీమకు ఆనాడు వైయస్సార్‌గారు, ఆ తర్వాత సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు మాత్రమే మేలు చేశారు. చంద్రబాబు తన హయాంలో ఆ ప్రాంతంలో కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఏ ప్రాజెక్టునూ తీసుకురాలేదు. అయినా టెంపరితనం, బరితెగింపు ఇవాళ ఈనాడులో కనిపించింది. చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు.

రాయలసీమలో అభివృద్ధి. సంక్షేమం:
సీఎంగారు నిన్ననే చిత్రావతి రిజార్వాయర్‌ వద్ద టూరిజమ్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇవాళ చిత్రావతిలో 10 టీఎంసీలు, గండికోటలో 27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే బ్రహ్మసాగరంలో గరిష్టస్థాయిలో 15 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
రాయలసీమకు ఏకైక ఆధారం శ్రీశైలం ప్రాజెక్టు. అందుకే వరద జలాలు ఉన్నప్పుడు అన్ని రిజర్వాయర్లు నింపుతున్నారు. ఆనాడు వైయస్సార్‌గారు పోతిరెడ్డిపాడు ద్వారా ఆ పని చేయగా, ఇప్పుడు జగన్‌గారు అన్ని కాల్వలను వెడల్పు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 854 అడుగులకు దిగువన కూడా నీరు తీసుకునేలా లిఫ్ట్‌ పథకం చేపట్టారు.
చంద్రబాబు రాయలసీమకు మేలు చేయకపోగా, ద్రోహం చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. ఎన్జీటీలోనూ ఫిర్యాదు చేశారు. హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల్లో ఉన్న సమస్యల నుంచి గట్టెక్కించి కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు సీఎంగారు కృషి చేస్తున్నారు.
రాయలసీమ ప్రాంతంలో కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలు, క్యాన్సర్‌ ఆస్పత్రులు కర్నూలు, కడపలో ఏర్పాటు చేస్తున్నాం. ఇంతగా రాయలసీమకు గతంలో ఎవ్వరూ చేయలేదు.

సీమ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబు:
చంద్రబాబు చివరకు కుప్పంకు కూడా ఏమీ చేయకపోగా, రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే ఎవరైతే హత్య చేస్తాడో.. అతడే బయటకు వచ్చి కేకలు వేసినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆయన కంటే పచ్చ మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్దాలను ఎదుర్కొనేందుకు మేము ఎప్పటికప్పుడు వాస్తవాలు చెప్పాల్సి వస్తోంది.

పోలవరంపైనా బాబు అసత్య ప్రచారం:
పోలవరం ప్రాజెక్టును తానే కట్టానంటాడు చంద్రబాబు. 70 శాతం కాదు మొత్తం 95 శాతం తానే చేశానంటాడు. ఇంకా చెప్పాలంటే అది తాను డిజైన్‌ చేశానంటాడు. నిజానికి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం వచ్చినా దుర్వినియోగం చేసుకున్నాడు. స్వయంగా ప్రధాని మోదీగారే చెప్పారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఒక ఏటీఎంగా వాడుకున్నారని. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసేది అంత కంటే లేదు.
ఏ మాత్రం ప్లానింగ్‌ లేకుండా స్పిల్‌వే పూర్తి చేయకుండా, రెండు సందులు వదిలేసి కాఫర్‌ డ్యామ్‌ కట్టాడు. కింద డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం. దాని వల్ల జరిగిన నష్టం అంచనా వేయడమే కష్టం అవుతోంది.
ఒకవైపు కరోనా, మరోవైపు డయాఫ్రమ్‌ వాల్‌ ధ్వంసం కావడం.. ఈ కారణాల వల్లనే పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఆనాడు పట్టిసీమ పనులు చేసి, అక్కణ్నుంచి వైయస్సార్‌గారు నిర్మించిన కాల్వల ద్వారా నీరు పారించి, పోలవరం నుంచి నీరు తరలించినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.

పరిపాలనా వికేంద్రీకరణే మా విధానం:
మా పార్టీ లైన్‌ కానీ, ప్రభుత్వ నిర్ణయం కానీ పరిపాలన వికేంద్రీకరణ. దానిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తాం. ఇదంతా రహస్యంగా జరిగేది కాదు. అన్ని కోణాల్లో ఆలోచించే ప్రక్రియ కొనసాగిస్తాం. చంద్రబాబు రోజంతా భ్రమల్లో ఉంటున్నారు. పగటి కలలు కంటున్నారు. ఆయన ఇవాళ్టికి కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. అర్ధం లేని విమర్శలు చేస్తూ, తనకు తాను తృప్తి చెందుతున్నారు.

అది పూర్తిగా అవాస్తవం:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నామన్నది పూర్తిగా అవాస్తవం. ఆ వార్త చూసి మేము కూడా ఆశ్చర్యానికి గురయ్యాం. కింది స్థాయిలో జరిగినదిగా తెలిసింది. కమ్యునికేషన్ గ్యాప్ వల్ల కింది స్థాయిలో ఎవరో చేసింది. సీఎం గారి దృష్టికి రాగానే చాలా సీరియస్ అయ్యారు. ఎంప్లాయిమెంట్ విపరీతంగా జనరేట్ చేస్తున్న ప్రభుత్వం మాది. గతంలో ఎప్పుడూ లేనంతగా రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇప్పుడు పోలీసు రిక్రూట్ మెంట్ కూడా జరుగుతోంది
– అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి.. మోర్ సెక్యూరిటీ క్రియేట్ చేసిన ప్రభుత్వం ఇది. మరిన్ని ఉద్యోగావకాశాలు, ఉద్యోగ భద్రతపైనే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అదే మా ప్రభుత్వ లక్ష్యం. అంతే తప్ప హడావిడిగా ఉద్యోగులను తీసివేయడాలు ఉండవు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పష్టం చేశారు.

Also Read : తృణ ధాన్యాల సాగుకు ప్రోత్సాహం – సిఎం వైయస్‌.జగన్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్