బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో మహా కూటమిగా ఏర్పడిన నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పదవి చేపట్టగా.వీరికి 165 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాల్లో బలపరీక్షకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, బలపరీక్షకు ముందే బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.తనపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా ఉందని, నిబంధనల ప్రకారం లేదని సభలో సిన్హా వ్యాఖ్యనించారు.
. బిహార్‌లో ఇటీవల జేడీయూ, ఆర్జేడీ, ఇతర పార్టీలతో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే నితీష్ ప్రభుత్వం.. బలపరీక్షకు కొన్ని గంటలకు ముందు బిహార్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. రైల్వో ఉద్యోగాల కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు, ఎమ్మెల్సీ సునీల్ సింగ్‌కు సంబంధించిన ప్రదేశాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అష్ఫాక్ కరీం ఇంటిపై కూడా దాడులు జరుగుతున్నాయి.
ఈ దాడులపై ఆర్జేడీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భయంతో ఎమ్మెల్యేలు వారికి అనుకూలంగా వస్తారని భావించి ఇలా చేస్తున్నారని సునీల్ సింగ్ ఆరోపించారు.
లాలూ ప్రసాద్ యాదవ్.. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు భారతీయ రైల్వేలో జరిగిన కుంభకోణానికి సంబంధించి భోలా యాదవ్‌ను నెల రోజుల క్రితం సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. భోలా యాదవ్‌కు చెందిన పాట్నా, దర్భంగాలోని నాలుగు ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు నిర్వహించి, అతని పూర్వీకుల ఇంటి నుంచి నేరారోపణ పత్రాలు, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక, భోలా యాదవ్ 2005 నుంచి 2009 మధ్య యూపీఏ ప్రభుత్వ సమయంలో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌కు ఓఎస్‌డీ అధికారిగా ఉన్నారు.
ఇక, ఈ కేసులో ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్‌లలో ఉద్యోగాలు పొందిన 12 మందితో పాటు లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లపై సీబీఐ మే 18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Also Read : బీహార్ లో కొత్త కూటమి ?