IPS-Recall: ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఈ క్రమంలో అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను రీకాల్ చేసే అవకాశం కూడా ఉందని రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, చట్టం ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులు తమ బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తాము తీసుకున్న శిక్షణను ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు ఉంటాయి…పోతాయని, కానీ అధికారులు వ్యవస్థలో భాగమన్న విషయాన్ని తెలుసుకొని మసలుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్ళమని, సంబంధిత శాఖ అధికారులు ఇక్కడి అధికారుల పనితీరును టెలి స్కోప్ లో పర్యవేక్షిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక మీదట మీ ఆటలు సాగవంటూ పోలీసు అధికారులను సిఎం రమేష్ హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని రమేష్ ఆరోపించారు. ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలన్నది బిజెపి విధానమని అయన స్పష్టం చేశారు. ప్రభుత్వం విధ్వంసకర విధానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వానికి సినిమా టికెట్ రెట్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని సిఎం రమేష్ విమర్శించారు. ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మొత్తాన్నీ లక్ష్యంగా చేసుకుంటారా అని ప్రశ్నించారు. పట్టింపులకు, ఫాల్స్ ప్రెస్టేజ్ కు పోయి సినిమా వారిని వేధించాలని చూస్తోందన్నారు.
సిఎం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిని ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ నెల 28న విజయవాడలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, కేంద్రం నుంచి ఓ ప్రముఖ నేత ఈ సభకు వస్తారని రమేష్ వెల్లడించారు.
Also Read : లుధియానా పేలుళ్ళ వెనుక ఖలిస్తాన్