Babu outbursted:
శాసనసభలో నేడు జరిగిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా కలత చెందారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనై ఒక్కసారిగా విలపించారు. సభలో తన భార్య భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులు, పార్టీ నేతలు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. తనను రెండున్నరేళ్లుగా వ్యక్తిగతంగా ఎంతగా మాటల దాడి చేస్తున్నా భరించానని, చివరకు తన కుటుంబ సభ్యులపై మాటల దాడి చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా దుర్మార్గమన్నారు. నలభై ఏళ్ళు తాను రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసింది దీనికోసమా అనేది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, గతంలో అయన టిడిపిలో పనిచేశారని, రాజకీయంగా విభేదించి ఇప్పుడు వేరే పార్టీలో ఉండొచ్చని, కానీ సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి, ఆవేదన చెప్పుకోడానికి తనకు కనీసం అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు.
డర్టీ రాజకీయాల్లోకి తన భార్య భువనేశ్వరిని లాగడం దారుణమని, ప్రోటోకాల్ కార్యక్రమాలకు తప్ప ఆమె ఎప్పుడూ బైటకు రాలేదని, ఎన్నడూ రాజకీయాల్లో ఆమె ఆసక్తి ప్రదర్శించలేదని, ఇప్పటికీ పార్టీ నేతల్లో ఎక్కువమంది ఆమెకు తెలియదని అన్నారు. తనను ప్రోత్సహించడం తప్ప ఆమెకు ఏమీ తెలియదని, అలాంటి ఆమెపై కూడా ఇలా వ్యాఖ్యానించడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలలో ఆమె చేసిన త్యాగం ఎంతో గొప్పదని కొనియాడారు. సమస్యలు వచ్చినప్పుడు ఆమె తన వెన్నంటే ఉన్నారని, వెన్నుతట్టి ప్రోత్సహించారని, ప్రతి సంక్షోభంలోను అండగా ఉన్నారని వివరించారు.
రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను సునాయాసంగా ఎదుర్కొన్నానని, పార్టీ ఓటమి పాలైనప్పుడు కూడా ఇంతగా బాధపదలేదని బాబు గద్గద స్వరంతో చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ ఇలా వ్యక్తిగతంగా విమర్శించలేదని, దేశం కోసం, రాష్ట్రం కోసం తప్పితే స్వార్ధం కోసం ఆలోచించలేదన్నారు.
Also Read : సభా సాక్షిగా చంద్రబాబు శపథం