Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్క్షమాపణ చెప్పాల్సిందే: జోగి

క్షమాపణ చెప్పాల్సిందే: జోగి

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని వైఎస్సార్సీపీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వారు తమ భాషను సరిచేసుకోవాలని, ఇలాగే వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తమ ఆందోళన కొనసాగిస్తామని, నిన్న జరిగింది ఆరంభం మాత్రమేనని అయన హెచ్చరించారు. సిఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడే భాషను మార్చుకోకపోతే రాష్ట్రంలో నిరసన తెలుపుతామని, చంద్రబాబు ఎక్కడ పర్యటిస్తే అక్కడ నిరసన తెలుపుతూ, వెంటపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకు అర్జీలు ఇవ్వడం సాధారణంగా జరిగే విషయమేనని, అలాగే అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకే చంద్రబాబు ఇంటికి వెళ్లనని, అయన బైటకు వచ్చి తన అర్జీని తీసుకుంటే సరిపోయేది కదా అని ప్రశించారు.

ముఖ్యమంత్రిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఒక పౌరుడిగా, బాధ్యతగల వ్యక్తిగా నిరసన తెలియచేయడానికి వెళితే తనపై రాళ్ళు వేయించారని జోగి ఆరోపించారు. కారు అద్దాలు పగుల కొట్టారని, కారు దిగకముందే నాపై దాడికి ప్రయత్నించి, నానా రభస సృష్టించి తాను దండయాత్రకు వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయించడం తగదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిందని, ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతూనే ఉన్నారని, రేపు వెలువడబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో  టిడిపి గూబ గుయ్యమనేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని జోగి ధీమా వ్యక్తం చేశారు. రేపటి ఫలితాల్లో 97శాతం పైగా స్థానాలు వైయస్సార్‌ సీపీ కైవసం చేసుకుని, చరిత్ర పుటల్లో మిగలిపోతుందని జోగి రమేష్ జోస్యం చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్