Sparsha Darshan: భక్తుల విజ్ఞప్తి మేరకు, భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులందరికీ కల్పిస్తున్న ఈ సేవల్లో 31వ తేదీ నుంచి మార్పులు చేశామన్నారు.
గతంలో వారానికి నాలుగు రోజులపాటు మధ్యాహ్నం 2.00గంటల నుంచి గం.3.00ల వరకు; తిరిగి సాయంత్రం 6.00గంటల నుంచి 7.00గటల వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పించామని తెలిపారు. స్వామివార్ల స్పర్శదర్శనం కోసం తిరిగి సాయంత్రం 6.00గంటల వరకు వేచి వుండాల్సి వస్తున్నదని, దీనివలన దర్శనానంతరం ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇబ్బందికరంగా ఉన్నదని పలువురు భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకురావడం జరిగిందని ఈవో పేర్కొన్నారు.
ఈ మేరకు భక్తులు దర్శనానంతరం వారి వారి ప్రాంతాలకు వెళ్ళేందుకు వీలుగా మధ్యాహ్నం పూటే మరో గంటపాటు సమయం పెంచామని వెల్లడించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మధ్యాహ్నం 2.00గంటల నుంచి సాయంత్రం 4.00గంటల వరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కారణంగా గతంలో సాయంకాలం 6.00గంటల నుంచి రాత్రి 7.00గంటల వరకు అమలులో ఉన్న స్పర్శదర్శన సదుపాయం నిలుపుదల చేస్తున్నామన్నారు.