మలయాళంలో కుంచాకో బోబన్ కి ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలలో ఇమిడిపోయే విధానం ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో వస్తున్న ఆయన సినిమాల వలన ఇతర భాషా ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. ఆయన హీరోగా నటించిన ‘చావెర్’ మూవీ .. ‘సోనీ లివ్’ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది చిన్న సినిమానే. కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే, ఎక్కువ మందిని ఆకట్టుకునే సినిమా ఇది.
ఈ కథ నలుగురు హంతకుల చుట్టూ తిరుగుతుంది. హత్య చేసిన తరువాత హంతకుల కదలికలు ఎలా ఉంటాయి? బయట పరిస్థితులను బట్టి వాళ్లు తమ ప్లాన్ ను ఎలా మార్చుకుంటూ వెళతారు .. హత్యతో ఎలాంటి సంబంధం లేని అమాయకులు ఒక్కోసారి ఎలా ఆ కేసులో ఇరుక్కుపోతారు. అలాంటి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అనేది దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. అందువలన మొదటి నుంచి చివరివరకూ ఈ కథను ప్రేక్షకుడు ఫాలో అవుతాడు.
హంతకులకు ఎమోషన్స్ ఉంటాయంటే ఎవరూ నమ్మరు. అనుకోకుండా జరిగే హత్యల సంగతి అలా ఉంచితే, పక్కా ప్లాన్ చేసి హత్య చేసేవారికి సున్నితమైన మనసు ఉంటుందని ఎవరూ భావించరు. ఈ కథలో నలుగురు హంతకులు ఒక వ్యక్తిని హత్య చేస్తారు. కానీ ఆ హత్య చేసినందుకు వాళ్లు చాలా బాధపడతారు. ఆ హత్య చేయకుండా ఉండవలసిందంటూ ఆవేదన చెందుతారు. అంతగా వాళ్లు బాధపడటానికి కారణం ఏమిటనేది ఈ కథ. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటోంది.