Sunday, November 24, 2024
HomeTrending Newsఇయర్ మఫ్ లతో ప్రత్యేక గుర్తింపు

ఇయర్ మఫ్ లతో ప్రత్యేక గుర్తింపు

Chester Greenwood : ఓ విద్యార్థి వార్షిక పరీక్షలో అన్ని సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. దాంతో అతనిని ప్రధానోపాధ్యాయుడి వద్దకు పంపారు. అతనిని చూడటంతోనే ప్రధానోపాధ్యాయుడికి తెగ కోపం వచ్చింది. “ఈ స్కూల్లో పదేళ్ళుగా చదువుతున్నావు. ప్రతి ఏటా ఇదే స్థితి. అయితే ఈసారి మరీ దారుణం. ఒక్క సబ్జెక్టులోనూ ప్యాసవలేదు. క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు చెవిలో దూదేమన్నా పెట్టుకుంటావా?” అని మండిపడ్డారు. అయితే ఆ విద్యార్థి మౌనంగా నిలబడ్డాడు. ప్రధానోపాధ్యాయుడు తన కోపాన్ని కొనసాగిస్తూ “ఇక నువ్వు చదువుకి పనికిరావు కానీ…” అని నానా మాటలూ అనేసి టీసీ ఇచ్చి పంపించేస్తారు ఇక స్కూలుకి రానక్కర్లేదని! అతను ఏమీ మాట్లాడక స్కూల్లో నుంచి వీధిలోకొచ్చాడు.

అతనికీ ఓ మాట పదే పదే గుర్తుకొచ్చి చెవిలో విన్పిస్తున్నాయి. “ఏంటీ పాఠాలు చెప్తున్నప్పుడు చెవిలో దూదేమన్నా పెట్టుకుంటావా?” అనే మాటలు అతనిని ఆలోచనలో పడేశాయి. వెంటనే అతను తన రెండు చెవుల్నీ గట్టిగా మూసుకున్నాడు చేతులతో. ఈ ప్రపంచమంతా మౌనమై ప్రశాంతంగా అన్పించింది. ఏ ధ్వనీ చెవిని తాకడం లేదు. ఆ క్షణమే ఓ కొత్త ఆలోచన పుట్టింది. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్టే చెవిలో దూది పెట్టుకుని చూశాడు. తన మదిలో మెదలిన ఆలోచనకు ఓ కొత్త రూపం ఇచ్చాడు.

దాని పేరు ఇయర్ మఫ్ (Ear muff).

పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు మరే అడ్డంకీ లేకుండా బలే ఉపయోగంగా ఉందని ఈ ఇయర్ మఫ్ ని కొనడం మొదలు పెట్టారు. రణగొణ ధ్వనులతో చేసే పనులకు ఆటంకం కలగకుండా ఉంటుందని పని చేసేవారూ కొనసాగారు. దీంతో ఓ మేరకు వ్యాపారం బాగానే జరిగిందతనికి. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైన రోజులు. ఫిరంగుల మోతతో చెవులు పని చేయకుండాపోవడానికి చెవులలో తప్పనిసరిగా ఇయర్ మఫ్ పెట్టుకోవలసిందేనని ఓ అధికారి ఆదేశించారు. యుద్ధవీరులకు వీలుగా ఉండేలా హెల్మెట్ లోపల ఇయర్ మఫ్ఫుని అమర్చి వినియోగంలోకి తీసుకొచ్చిన అతను కోటీశ్వరుడయ్యాడు.

ఇంతకీ అతనెవరో చెప్పలేదు కదూ…అతనే ఛెస్టర్ గ్రీన్ ఉడ్.

జీవితంలో విజయం సాధించాలంటే చదువుతో పని లేదనీ, అవకాశాలను సృష్టించుకోవడమే విజయ రహస్యమని అతను నిరూపించిన ఛెస్టర్ గ్రీన్ ఉడ్ (జననం : 4 డిసెంబర్ 1858 – మరణం : 5 జూలై 1937) ఒక అమెరికన్ ఇంజనీర్. ఇయర్ మఫ్ తో పాటు మరెన్నింటినో కనుగొన్నతను. 1873లో ఇయర్‌మఫ్‌లను కనిపెట్టి గుర్తింపు పొందిన గ్రీన్ ఉడ్ కి ఇయర్ మఫ్ లు కుట్టిపెట్టడంలో తన అమ్మమ్మ సాయం పొందాడు. ఈ చెవిరక్షణ కవచాలతో ఫార్మింగ్‌టన్ అనే ప్రాంతంలో అనేకమందికి ఉపాధి కల్పించాడు.

మెటల్ రేక్, వెడల్పుగా ఉండే టీ కెటిల్, కలప బోరింగ్ మెషిన్, ఇయర్‌మఫ్స్, మరింత మెరుగుపరచిన ఇయర్‌మఫ్ వంటి అనేక ఇతర ఆవిష్కరణలకు పేటెంట్లు పొందిన గ్రీన్ ఉడ్ కి ఇసాబెల్ తో వివాహమైంది. గ్రీన్ ఉడ్ దంపతులకు నలుగురు పిల్లలు. ఫార్మింగ్‌టన్‌లో ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి శనివారాన్ని “ఛెస్టర్ గ్రీన్‌వుడ్ డే” ఆని జరుపుకుంటారు.

– యామిజాల జగదీశ్

Also Read :

అరటిపండ్లకోసం ఓ క్లబ్బూ..! ఓ మ్యూజియమూ!!

RELATED ARTICLES

Most Popular

న్యూస్