Tuesday, September 17, 2024
HomeTrending Newsప్రపంచ రాజకీయాల్లో అమెరికా బాటలోనే చైనా

ప్రపంచ రాజకీయాల్లో అమెరికా బాటలోనే చైనా

ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చితే ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయో అమెరికా చవిచూసింది. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ప్రాబల్యం తగ్గించేందుకు అమెరికా పెంచి పోషించిన తాలిబాన్ ఆ తర్వాతి కాలంలో ఏకు మేకైంది. న్యూయార్క్ WTO టవర్స్ కూల్చినాక రంకెలు వేస్తూ దాడులు చేసిన అమెరికా.. చివరకు తోక ముడిచి ఆఫ్ఘన్ నుంచి బలగాలు ఉపసంహరించాల్సి వచ్చింది.

గల్ఫ్ దేశాల్లో పట్టు కోసం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పై అమెరికా నిరాధార ఆరోపణలు చేసి అల్లకల్లోలం సృష్టించింది. ఈ రోజు ఐసీస్ రూపంలో ఇస్లామిక్ తీవ్రవాదం వెంటాడుతోంది. ఐసీస్ ఉగ్రవాద సంస్థ శాఖలే హమాస్, హిజ్బోల్లా, హుతి తదితర టెర్రరిస్టు గ్రూపులు. లాటిన్ అమెరికా దేశాల్లో కీలు బొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వనరుల దోపిడీ చేస్తోందని ఆయా దేశాల్లో ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి.

అమెరికాను నిలువరించే దిశగా చైనా రంగంలోకి దిగింది. అమెరికాను తలదన్నే రీతిలో మూడో ప్రపంచ దేశాలను ఆదుకునే పేరుతో ఆర్థిక సాయం చేస్తూ సహజ వనరుల దోపిడీ చేస్తోంది. డ్రాగన్ కుటిల నీతికి ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. భారత్ మినహా దక్షిణాసియా దేశాలు చైనా విషపు కోరల బారిన పడ్డాయి.

భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు దక్షిణాసియాలోని అన్ని దేశాలలో పన్నాగాలు చేస్తోంది. భారత్ పై వ్యతిరేకత పెంచటమే ధ్యేయంగా వ్యూహ రచన చేస్తోంది.

నేపాల్: హిమాలయ దేశంలో ఇటీవలే కేపి శర్మ ఓలి ప్రభుత్వ ఏర్పాటుకు లోపాయికారిగా సహకరించింది. భారత్ తో సరిహద్దు వివాదాలను రాజేయడానికి ఓలిని పావుగా చైనా వాడుకుందని ఆరోపణలు ఉన్నాయి. కరోనా సమయంలో నాసిరకం వ్యాక్సిన్ రకాలు సరఫరా చేసిందని ఆ దేశ ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. పౌరులు చైనాను వ్యతిరేకిస్తున్నా పాలకులు తమ గద్దె కాపాడుకునేందుకు డ్రాగన్ కొమ్ము కాస్తున్నారు.

శ్రీలంక: కొవిడ్‌ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మహింద రాజపక్స ప్రభుత్వం విఫలమైంది. పెల్లుబికిన ప్రజావ్యతిరేకత నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజపక్స విదేశాలకు పారిపోయారు. దీనంతటికీ చైనాతో జరిగిన ఒప్పందాలు, పాలకుల అవినీతి కారణమని ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు.

పాకిస్థాన్‌: గ్వదర్ ఓడరేవు అభివృద్ధి, సిపెక్ పేరుతో ఆక్రమిత కాశ్మీర్ నుంచి రోడ్డు మార్గం నిర్మించిన చైనా అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికులను నిర్లక్ష్యం చేసింది. గ్వదార్ ఓడరేవులో చేపల వేటకు స్థానికులకు అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగాల్లో చైనా వారినే తీసుకున్నారు. దీంతో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా పౌరులపై తిరుగుబాటుకు దిగింది. ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌, షహ్బాజ్ ఖాన్ ఎవరు ఉన్నా పాక్ పాలకులు చైనా అడుగులకు మడుగులు ఒత్తే దుస్థితి నెలకొంది.  చైనాకు వ్యతిరేకంగా ఉగ్రవాదం, తిరుగుబాట్లు పెచ్చుమీరుతున్నాయి.

అఫ్గానిస్థాన్‌: అమెరికా బలగాలు ఉపసంహరించుకున్నాక తాలిబాన్ లతో ఏ దేశం దౌత్య సంబంధాలకు సాహసించలేదు. ఆ సమయంలో చైనా బహిరంగంగా తాలిబాన్ పాలన గుర్తించకపోయినా అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తోంది. ఆఫ్ఘన్ లోని లిథియం నిల్వలు వెలికి తీసే కాంట్రాక్టు దక్కించుకున్న చైనా.. ప్రతిగా ఔషధాలు, వ్యాక్సిన్ లు సరఫరా చేస్తున్నా అవి నాసిరకంగా ఉన్నాయని ఆఫ్ఘన్లు పెదవి విరుస్తున్నారు.

మయన్మార్‌: అధికార జుంటా (సైనిక పాలకులు) పాలనకు చైనా వెన్నుదన్నుగా నిలిచింది. రోహింగ్యాలను తరిమి కొట్టడంలో జుంటా పాలకులకు సహకరించింది. ప్రజాస్వామ్య పునరుద్దరణకు చైనా కృషి చేయటం లేదని ఆ దేశ పౌరులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌: ప్రధానిగా షేక్ హసీనా వచ్చాక చైనా ప్రభావం తగ్గింది. భారత్ అనుకూల వైఖరి తీసుకున్న హాసిన ప్రభుత్వాన్ని దింపేందుకు మొదటి నుంచి చైనా కాచుకొని ఉంది. ఇటీవలి అల్లర్లు, సంక్షోభానికి నాయకత్వం వహించిన జమాతే ఇస్లామీ వంటి అతివాద శక్తులకు చైనా సహకరించిందని ఆరోపణలు వస్తున్నాయి.

స్వదేశంలో వీఘర్ ముస్లింలను దారుణంగా హింసిస్తున్న చైనా పొరుగు దేశాలకు హితబోధ చేస్తోంది. త్వరలోనే ముస్లిం అతివాద శక్తులు చైనాలో ఆశాంతి సృష్టించ వచ్చని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకుల అంచనా. చైనా మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉందని అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్