China Takes Steps To Increase Population :
చైనాలోని జిలిన్ ప్రావిన్స్ జనాభా పెరుగుదల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పెళ్ళైన కొత్త జంటలు పిల్లల్ని కనేందుకు సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ తరహా విధానం ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఉంది. దీనికి ప్రజల నుంచి స్పందన రాకపోవటంతో ఇందుకు అదనంగా మరికొన్ని వరాలు ప్రకటించారు. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు కూడా ఇవ్వాలని జిలిన్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. పెళ్ళైన జంటకు 32 వేల అమెరికన్ డాలర్లు ఆర్ధిక సాయం చేయాలని ముందుకు వచ్చింది.
తక్కువ వడ్డీ రేటు, పన్నుల నుంచి మినహాయింపుతో పాటు ప్రభుత్వ లక్ష్యాలను చేరుకున్న జంటలు తాము తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించటం కూడా అవసరం లేదని అధికారులు ప్రకటించారు. గత దశాబ్దం నుంచి జిలిన్ ప్రావిన్స్ లో జనాభా అనుహ్యరీతిలో తగ్గిపోతోంది. చైనా ప్రభుత్వం మనమిద్దరం మనకు ఒకరు అనే విధానం ప్రకటించాక జిలిన్ ప్రావిన్స్ లో కఠినంగా అమలు చేశారు. దీంతో ఒక దశాబ్దంలోనే 12 శాతం జనాభా తగ్గింది. దీనికి తోడు వయసు మళ్ళిన వృద్దుల జనాభా పెరగటం స్థానిక అధికార యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది.
తాజాగా చైనా ప్రభుత్వం ఓ కుటుంబం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు జన్మ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వటంతో జిలిన్ ప్రావిన్సు ఉపిరి పీల్చుకుంది. జనాభా పెరుగుదలకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు ఇచ్చేందుకు రాజధాని చంగ్చున్ లో తరచుగా పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. ఉత్తరకొరియా, రష్యా సరిహద్దుల్లో ఉండే జిలిన్ ప్రావిన్స్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కాగా పొరుగు దేశాల ప్రభావంతో స్థానిక ప్రజలు బహుళ సంస్కృతులు ఆచరిస్తారు.
Also Read : బంగ్లాదేశ్ లో ఓడ ప్రమాదం, 32 మంది మృతి