చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇందులో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ అదిరింది అనేలా పాటలు ఉండడంతో వాల్తేరు వీరయ్య మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న వాల్తేరు వీరయ్య చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
అయితే.. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నటిస్తున్న మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఉగాది కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది అనౌన్స్ చేయలేదు. పూరి జగన్నాథ్.. చిరు కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. అయితే.. కేజీఎఫ్ మూవీతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ కూడా చిరంజీవి కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేస్తున్నారట.
ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉంటారని సమాచారం. ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ గురించి ఆల్రెడీ చిరంజీవితో ప్రశాంత్ నీల్ చర్చించారని తెలిసింది. ఒకవేళ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్’ పూర్తి చేసి వెంటనే చిరు-చరణ్ లకు బౌండ్ స్క్రిప్ట్ వినిపిస్తే కథ వేరేగా ఉంటుందనడంలో సందేహం లేదు. జూ.ఎన్టీఆర్ తో సినిమా చేస్తూనే సైమల్టేనియస్ గా మెగా కాంపౌండ్ లోకి ప్రశాంత్ నీల్ అడుగుపెట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు సినీజనాలు. ఇక పూరితో పాటు మారుతి సహా ఇతర యువ దర్శకులు మెగాస్టార్ కోసం కథలు రెడీ చేసి వెయిటింగ్ లో ఉన్నారు. మరి.. చిరు ముందుగా పూరితో మూవీకి ఓకే చెబుతారో..? ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి ఓకే చెబుతారో అనేది ఆసక్తిగా మారింది.