Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచిరంజీవికి బహిరంగ లేఖ

చిరంజీవికి బహిరంగ లేఖ

Change accordingly:
చిరంజీవి గారూ!
తెలుగు ప్రేక్షకులు మీ మూస నుండి బైట పడ్డారు. దాన్నుండి మీరే బైటపడాలి ఇంక! లేకుంటే మీ ఇర్రలెవెన్స్ కొనసాగుతూనే వుంటుంది. ‘లార్జర్ దేన్ ద స్టొరీ’ ఇమేజ్ మీ శతృవు. ప్రతి సినిమాని ఓ బాధ్యతగా చూసే మా జనరేషన్ ఇప్పుడు లేదు. ఇరగతీసే ఫైట్ల కంటే ఏదో ఎమోషన్ కావాలి ఇప్పటి జణానికి. రియాల్టీ షోల్లో దద్దరిల్ల కొట్టే డాన్స్ షోలు ఫ్రీగా చూస్తున్న కాలంలో మీ ప్రాచీన కాలపు గుడుగుడు గుంజం స్టెప్పులు, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ వంటి ఐటం డాన్సులు…ఏమీ కిక్కివ్వవు. వందల రూపాయిలు ఖర్చుపెట్టి చూసే సినిమా ఇప్పుడు జస్ట్ వినోదం కాదు ప్రేక్షకులకి. వాళ్లు దాన్నో ప్రోడక్ట్ కింద కూడా చూస్తున్నారు. ప్రేక్షకుడిలో కూడా కన్సూమరిస్ట్ పెరుగుతున్నాడు. గోళ్లకు మట్టి అంటకుండా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఇంటికొచ్చి డెలివరీ చేసిన వాటిని కూడా నిర్మొహమాటంగా తిరస్కరించే కన్సూమరిస్ట్ నేటి ప్రేక్షకుడు. రివ్యూలు చదివి మరీ గొప్పదైతేనే థియేటర్ కి వెళుతున్నాడు. బొమ్మ సరైన ప్రొడక్టుగా బైటకి రాకపోతే ఇదివరకటిలా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే సీన్ లేదు.

ప్రేక్షకులు హీరో కంటే కంటెంట్ ను, దాని నేరేషన్ ను ఎక్కువగా చూస్తున్నారు. కానీ మీ/మా దురదృష్టం ఏమిటంటే మీరింకా సినిమాకి కథ కన్నా, కథనం కన్నా మీరే ముఖ్యమనుకుంటున్నారు. అందుకే నక్సలైట్ పాత్ర వేసినా ఐటం సాంగ్స్ అనే భావదరిద్రం నుండి అంగుళం బైటపడ లేకపోయారు. యాభైల్లో పడ్డ మీ అభిమాన ఆల్ ఖైదా బ్యాచ్ కొందరు మిమ్మల్ని ఇంకా గుండెల్లో పెట్టుకోవచ్చు. నలభైల్లోకొచ్చిన కొత్త మధ్య వయస్కులు కూడా ఇంకా ఆ అభిమానాన్ని క్యారీ చేస్తుండొచ్చు.  కానీ ఈ ఇరవైల తరానికి మీరు కంప్లీట్లీ ఔట్ డేటెడ్. వాళ్ల అభిరుచుల దరిదాపుల్లో మీరు లేరనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. వాళ్లు హాలీవుడ్ సినిమాలు బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారు. వెబ్ సిరీసెస్ లోని కరడుకట్టినతనాన్ని ఆదరిస్తున్నారు. ఓటీటీల ద్వారా సృజనాత్మకతకి పెద్ద పీట వేసే తమిళ్, మలయాళీ, మరాఠీ, హిందీ సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎవడికి కావాలి మీ మూస ఫైట్స్, డాన్సులు?

ఇప్పుడు కొత్తగా ఆలోచించకపోతే, మీ వయసుకి మీరు గౌరవం తెచ్చుకునే పాత్రలు ఎంపిక చేసుకోకపోతే మీరు కేవలం ఓ గతంగా మిగిలిపోతారు. వర్తమానంలో మీకు స్థానం ఉండదు. మీరు ఔట్ డేటెడ్ అని గుర్తించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా జంధ్యాలగారి ఎత్తిపొడుపు వంటి తిట్టు ఒకటి జ్ఞాపకం వస్తుంది. “మొజాయిక్ ఫ్లోర్ మీద ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని దిగులుపడితే ఎలా?”

పీఎస్:
నేనేం చిరంజీవిగారి అభిమానిని కాను. ఆయన పునర్వైభవాన్ని కాంక్షిస్తూ ప్రేమతో రాసిన పోస్టు కాదు ఇది. అలెటర్నేటివ్ సినిమా అభిమానిని. ఎంత కాదన్నా సినిమా ఒక పరిశ్రమ కదా. దాని జయాపజయాల ప్రభావం చాలామంది మీద ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు ఆరోగ్యకర వినోద ప్రధాన సినిమాలు వస్తే చాలనుకుంటా.

-అరణ్య కృష్ణ

(సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్ట్ ఇది. అరణ్య కృష్ణ కలం పేరు అయి ఉండవచ్చు. రచయిత అనుమతి లేకుండా వాడుకుంటున్నందుకు క్షమాపణలతో..) 

Also Read :

తోటకూర నాడే అని ఉంటే…

RELATED ARTICLES

Most Popular

న్యూస్