Sunday, January 19, 2025
Homeసినిమాపద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు నటుడు

పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు నటుడు

Actor Nagaiah- Kind at heart: తెలుగు సినిమా టాకీలు మొదలైన తొలినాళ్లలో నటుడిగా ఆ దిశగా అడుగులు వేసి, ఆ తరువాత కాలంలో తెలుగు సినిమాకి పెద్ద దిక్కుగా నిలిచిన మహోన్నత నటుడు చిత్తూరు నాగయ్య. సాంఘిక .. జానపద .. పౌరాణిక  చిత్రాలతోనే కాదు, భక్తి చిత్రాల ద్వారా కూడా నటుడిగా తన ప్రతిభను .. ప్రభావాన్ని చూపినవారాయన. కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆయన, ఆ తరువాత కాలానికి తగినట్టుగానే కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా మారారు. ఏ పాత్రను పోషించినా సినిమాకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చారు .. సహజత్వానికి సరిహద్దుగా నిలిచారు.

నాగయ్య అసలు పేరు ఉప్పలదడియం నాగేశ్వరం. అయితే ఆయన సినిమా పరిశ్రమకి చిత్తూరు నుంచి రావడం వలన చిత్తూరు నాగయ్యగా  అంతా పిలిచేవారు. గుంటూరు జిల్లా రేపల్లె గ్రామంలో జన్మించిన ఆయన, మొదటి నుంచి కూడా సంగీతం పట్ల  .. నాటకాల పట్ల ఆసక్తిని కనబరుస్తూనే వెళ్లారు. సినిమాల్లోకి వెళ్లడానికి ముందు ఆయన ఎక్కువగా తిరుగాడిన ప్రదేశాలుగా తిరుపతి .. కుప్పం .. మదనపల్లి .. చిత్తూరు కనిపిస్తాయి. నాటకాల నిమిత్తం కూడా ఆయన ఈ ప్రాంతాల్లో ఎక్కువ పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నారు.

ఇక తెలుగుతో పాటు తమిళంలోను నాటకాలు ఆడుతూ ఉన్న రోజుల్లోనే ఆయన దృష్టి సినిమాల పైకి వెళ్లింది. ఎలాగైనా తెరమీద కనిపించాలనే ఆయనలోని ఆరాటాన్ని గమనించిన కొందరు, అవకాశం ఇప్పిస్తామని మోసం చేసిన సంఘటన ఆయన జీవితంలోను జరిగింది. ఆ తరువాత అతికష్టం మీద ఆయన హెచ్ ఎమ్ రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన ‘గృహలక్ష్మి’ సినిమాతో 1938లో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ సినిమాలో ‘కల్లు మానండోయ్ బాబూ .. కళ్లు తెరవండోయ్’ అనే పాటను కూడా పాడారు. నటుడిగా .. గాయకుడిగా కూడా ఆయనకి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా కోసం ఆయనకి లభించిన తొలి పారితోషికం 750 రూపాయలు.

ఇక ఆ తరువాత నటుడిగా ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 40వ దశకంలో వచ్చిన వేమన .. పోతన .. త్యాగయ్య సినిమాలతో నాగయ్య కీర్తి ప్రతిష్ఠలు ఆకాశమే హద్దుగా పెరుగుతూ వెళ్లాయి. ఈ సినిమాలు ఆయనకి సన్మానాలు .. కనకాభిషేకాలు చేయించాయి. నటుడు .. గాయకుడు అయిన నాగయ్య సంగీత దర్శకుడిగా కూడా రాణించడం విశేషం. ఇక ‘త్యాగయ్య’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ‘భాగ్యలక్ష్మి’ సినిమాతో నిర్మాతగాను తొలి ప్రయత్నం చేశారు. ‘భక్త రామదాసు’ సినిమాకి ఆయన దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా బాగానే ఆడినప్పటికీ, నాగయ్య అమాయకత్వం కారణంగా ఆ లాభాలు ఆయన వరకూ వెళ్లలేదు.

ఇలా చిత్తూరు నాగయ్య చేసిన పోతన .. త్యాగయ్య .. వేమన .. భక్త రామదాసు సినిమాలను ఒక వైపు, ఆయన చేసిన 300 లకి పైగా సినిమాలను మరొక వైపు వేస్తే తూకం కరెక్టుగా సరిపోతుందనే చెప్పాలి. ఆ నాలుగు సినిమాలు అంతలా ఆయన ప్రతిభాపాటవాలను నలుదిశలకి పరుగులు తీసేలా చేశాయి. ‘లవకుశ’ సినిమాలో వాల్మీకి పాత్రలో ఆయనను చూసినవారికి, నిజంగానే వాల్మీకీ ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. ‘తెనాలి రామకృష్ణ’ చూసినవారికి ‘తిమ్మరుసు’ ఇలాగే ఉండేవారేమోనని అనిపిస్తుంది. అంతలా పాత్రలో ఇమిడిపోతారాయన.

అసమర్థుడైన పేదవాడి పాత్రలలోను .. హుందాతనంతో కూడిన జమీందార్ పాత్రలలోను నాగయ్య ఎంతో గొప్పగా ఒదిగిపోయేవారు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఎంతో సహజంగా ఉండేవి. ఒక సినిమా చూస్తున్నామనే ఆలోచన ప్రేక్షకులకు వచ్చేది కాదు. అంత గొప్పగా ఆయన నటించేవారు. ఆయనతో కలిసి నటించేవారు, ఆయనముందు తమ నటన తేలిపోకుండా చూసుకునేవారు. అప్పట్లో ఆయనకి దక్కిన గౌరవం .. సన్మాన సత్కారాలను గురించి ఇప్పటికీ కథలు .. కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలా తెలుగులో అత్యధిక పారితోషికం అందుకున్న తోలినటుడు ఆయనే .. నటులలో తొలిసారిగా పద్మశ్రీ అందుకున్నది ఆయనే కావడం విశేషం.

జీవితంలో నాగయ్య ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. అందువలన ఏదీ శాశ్వతం కాదు అనే ఒక వైరాగ్యం ఆయనలో ఉండేది. అందువలన ఆయన డబ్బుకు పెద్దగా ప్రాధాన్యతను ఇచ్చేవారు కాదు. అవసరాల్లో ఉన్నామనీ .. ఆపదలో ఉన్నామని ఎవరైనా అడగడమే ఆలస్యం .. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తనకి తోచిన సాయాన్ని అందించేవారు. అలాగే ఆయన చాలామందికి మధ్యవర్తిగా ఉండి డబ్బు ఇప్పించారు. వాళ్లంతా ఆయనను మోసం చేశారు. తనతో కలిసి సినిమాలు నిర్మించిన వారు కూడా ఆయనను మోసం చేశారు.

ఇలా నాగయ్య మంచితనాన్ని .. అమాయకత్వాన్ని బలహీనతగా తీసుకుని, చాలామంది ఆయనను మోసం చేశారు. ఫలితంగా ఎంతో వైభవాన్ని అనుభవించిన నాగయ్య అంతగా కష్టాలు పడవలసి వచ్చింది. సుఖాలలో ఆయనను నీడలా వదిలిపెట్టనివారు, కష్టాల్లో కనపడకుండా పోయారు. దాంతో ఆరోగ్యం సహకరించని రోజుల్లో 100 రూపాయల కోసం కూడా ఆయన అతిథి పాత్రలు వేయవలసి వచ్చింది. అందరినీ నమ్మడమే తన ఆర్ధిక పతనానికి కారణం .. జీవితంలో ఎప్పుడూ ఎవరినీ నమ్మకూడదు అనడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని ఆయనే ఒక సందర్భంలో చెప్పారు. ఏదేవైనా తెలుగు తెరపై .. తెలుగు ప్రేక్షకుల హృదయాలపై నటుడిగా నాగయ్య వేసిన ముద్ర ఎప్పటికీ చెక్కు చెదరదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజున ఆయన వర్ధంతి .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.

(నాగయ్య వర్ధంతి ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read : బహుముఖ ప్రజ్ఞాశాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్