Saturday, July 27, 2024
Homeసినిమాస్వప్రకటిత బిరుదులు

స్వప్రకటిత బిరుదులు

Self-Praise: ఈమధ్య ఒక సినీ గేయ రచయిత పేరు ముందు “సరస్వతీ పుత్ర” అని బిరుదు తోడయ్యింది. బిరుదు ఎవరు ఎప్పుడిచ్చారో తెలియదు కానీ… పుట్టపర్తి నారాయణాచార్యుల అభిమానులుగా మా మనసులు నొచ్చుకున్నాయి. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం, అపారమయిన పాండిత్యం, వందకు పైగా గ్రంథాలు రాసి…తెలుగు పలుకుతో శివతాండవానికి నట్టువాంగం సమకూర్చిన పుట్టపర్తి వారికి “సరస్వతీ పుత్ర” సార్థక బిరుదు.

అలాంటి బిరుదుకు ప్రస్తుత గేయరచయిత అర్హుడు అనుకుంటే ఆ బిరుదును ఉంచుకోవచ్చు. లేకుంటే గౌరవంగా ఆ బిరుదు బరువును తగ్గించుకోవడం ఉత్తమం.

పుట్టపర్తికి “సరస్వతీ పుత్ర” బిరుదు అర్ధ శతాబ్దం క్రితమే ఉందని తెలియక పెట్టుకుని ఉంటే…చేయగలిగింది లేదు.

అయినా…సరస్వతికి అందరూ బిడ్డలే. అందరూ సరస్వతీ పుత్రులే.

“ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది;
ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది;
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది;
ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ మాది;
తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ పదునాల్గు భాషలందు,
బ్రతుకునకు బడిపంతులు, భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది”

అని బాధ పడ్డ పుట్టపర్తి వారు ఈ సరికొత్త సరస్వతీ పుత్రులను కూడా ఆశీర్వదిస్తారు.

ఎవరు సరస్వతీ పుత్ర? ఎవరు కాదు?
నిర్ణయించేది ఎవరు?

మాటవరసకు…
మెగాస్టార్ ను సూపర్ స్టార్ అంటే ఒప్పుకుంటారా?
మెగా హైడ్రో పవర్ అల్ట్రా వైలెట్ ను ప్రిన్స్ అంటే ఒప్పుకుంటారా?
అభిమానులు ఊ అంటారా?
ఊహూ అంటారా?

సాహితీ అభిమానులు కూడా అంతే. పుట్టపర్తి లాంటి గొప్పవారిని గుర్తించకపోయినా పరవాలేదు…వారి కీర్తికి మసిపూయకుంటే చాలు.

-మస్తిపురం రమేష్

Also Read : ప్లీజ్ అలా చేయొద్దు: సినిమా యూనిట్ విజ్ఞప్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్