మొదటి సందర్భం:
ఉత్తర ప్రదేశ్ లో ఒక మారు మూల కుగ్రామం. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఉన్నంతలో పందిరి ఘనంగానే వేశారు. బాజా భజంత్రీలు పెట్టారు. పది మందినీ పిలిచారు. రంగుల లైట్లు పెట్టారు. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ బిజీగా ఉన్నారు. అంతా సందడి సందడిగా ఉంది.
ఆ శుభ ముహూర్తం రానే వచ్చింది. పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు దండలు మార్చుకోవాలి. అత్తరు చల్లిన పరిమళాలతో మత్తెక్కిన పూల దండలను అబ్బాయి, అమ్మాయి చేతికి ఇచ్చారు. కెమెరాలు అలెర్ట్ అయ్యాయి. మేళతాళాలు మిన్ను ముట్టాయి. బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు విచ్చుకుంటూ ఉండగా అమ్మాయి అబ్బాయి మెడలో పూలదండ వేయబోతూ…అరమోడ్పు కన్నులు విప్పి పూర్తి కన్నులతో అబ్బాయిని తేరిపారా తదేకంగా చూసింది. అమ్మాయి చూపులకు అబ్బాయి బుగ్గల్లో కూడా గులాబీలు మొగ్గ తొడిగాయి.
అంతే…అమ్మాయి దండ కింద పడేసి…వేదిక దిగి వెళ్ళిపోతోంది. ఏమయ్యిందో తెలియక అందరూ అమ్మాయి వెంట పడ్డారు. అబ్బాయి కారు నలుపు. ఇంత నలుపు అని పెళ్లి చూపులప్పుడు అనుకోలేదు. ఈ నలుపు నాకొద్దు. ఈ పెళ్లి నాకొద్దు అని తెగేసి చెప్పింది. కాళ్లా వేళ్లా పడి కాళ్ల పారాణి గురించి అందరూ చెప్పి చూశారు. అబ్బాయి మొహానికి పూసుకోండి పారాణి అని అమ్మాయి…కారు చీకట్లలో తెల్లటి కాంతి రేఖ వెతుక్కుంటూ పందిరి వదిలి వెళ్లిపోయింది. పెళ్లి ఆగిపోయింది.
అమ్మాయి ప్రాధాన్యం రంగు! రంగువెలిసిన జీవితంలో అబ్బాయి రంగునయినా చూసుకుని బతకవచ్చు కదా అన్నది ఆమె అభిప్రాయం కావచ్చు!
రెండో సందర్భం:
ఇది కూడా ఉత్తర ప్రదేశ్ లోనే. ఏర్పాట్లన్నీ సేమ్ టు సేమ్ మొదటి సందర్భంలో ఉన్నట్లే ఏ వెలితీ లేకుండా జరిగాయి. ఇక్కడ నాన్ వెజ్, లిక్కర్ అదనం. మరికాసేపట్లో తాళి కట్టాలి.
ఈలోపు ఏమయ్యిందో తెలియదు. పెళ్లి కొడుకు పందిరి దిగి పట్టు బట్టలతో రోడ్డున పడి జేబుల్లో చేతులు పెట్టుకుని ఎటు వెళ్లాలో తెలియక ఎటో వెళ్ళిపోతున్నాడు.
ఏమి జరిగిందో అర్థం కాక అందరూ జుట్లు పట్టుకున్నారు. నెమ్మదిగా ఆరా తీస్తే తేలిందేమిటయ్యా అంటే… పెళ్లి విందులో అందరూ పీకల దాకా మందు తాగారు. తాళిదేముంది? ముందు మందే ప్రధానం. స్టేజ్ మీద పెళ్ళికొడుకు తరుపు అబ్బాయిల కంటే పెళ్లికూతురు తరుపువారికే ఫోటోలు తీయడంలో ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎవరో గమనించారు. ఎంతసేపూ మీరేనా? మేం అబ్బాయి వైపు మమ్మల్ను స్టేజ్ ఎక్కనివ్వరా? అని తాగి ఉన్న పిల్లలు తన్నులాట స్టార్ట్ చేశారు. మీరు తమలపాకుతో ఒక్కటంటే మేము తలుపు చెక్కతో రెండంటాం అని అమ్మాయి తరుపు పిల్లలు కర్రలు తీసుకుని అబ్బాయి తరుపువారిని మేళ తాళాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అనుగుణంగా చితకబాదారు. పెళ్లి పెటాకులయితే అయ్యింది కానీ…ఫోటోల కోసం జరుగుతున్న యుద్ధంలో తగ్గేదే ల్యా అని వీరు కుర్చీలు తిప్పి అమ్మాయి వైపు బంధువులకు దేహశుద్ధి చేశారు.
రెండు శత్రు శిబిరాల్లో రక్తాలు కారాయి. ఎముకలు విరిగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి…యుద్ధం మధ్యలో సంధి కుదిర్చి…అతి కష్టం మీద పెళ్లి జరిపించారు. అబ్బాయి చేత తాళి కట్టించడానికి ఊరి జనం తల ప్రాణం తోకకు వచ్చింది.
అతడి భయం అతడిది!
తాళికి ముందే ఇంత ఎగతాళి విధ్వంసం, దాడులు అయితే తాళి తరువాత పరిస్థితి ఏమిటన్న ఆలోచన సహజం. అయినా విధికి ఎదురెళ్లాల్సిన జాతకం అతడికి రాసిపెట్టినట్లు ఉంది. సాహసం చేశాడు. అతడి ధైర్యమే అతడి కళ్యాణ రక్ష!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :
Also Read :