ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే రుణంలో ప్రతి రూపాయినీ ప్రజా సంక్షేమంకోసమే వినియోగిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. అప్పులపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి చదువుతున్నారని, ఆమె బాబు కోసమే పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 3,820 కోట్ల రూపాయలతో వైద్య శాఖలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో రూ. 600 కోట్ల రూపాయలతో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని, ఇప్పటికే రూ. 150 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు.
రూ.8500 కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఈ ఏడాది ఐదు కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. మచిలీపట్నంలో 64 ఎకరాల్లో రూ.550 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీలో సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.