స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా.. ఒక కుటుంబం ఒక యూనిట్ గా, యూనిట్ వొక్కంటికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా, అందజేయాలని అఖిల పక్ష సమావేశం సమిష్టి నిర్ణయం తీసుకున్నది.
మొదటి దశలో, 119 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు గాను 1200 కోట్ల తో ” సీఎం దళిత సాధికారత పథకం” ప్రారంభం చేయాలని, ఎంపిక చేయబడిన బాటమ్ లైన్ లో వున్న కడు పేద దళిత కుటుంబానికి (రైతు బంధు పథకం మాదిరి) నేరుగా అందచేయాలని సీఎం కెసిఆర్ అధ్యక్షతన అఖిల పక్షం నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచబోతున్న ‘సీఎం దళిత సాధికారత పథకం’ దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదం చేయనున్నదనీ, దళిత జనోద్ధరణకు సీఎం కెసిఆర్ ఆలోచనలు, ఇప్పటికే అమలుపరుస్తున్న కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనీ, దళిత సాధికారత పథకంతో మరింత గొప్పగా దళితుల జీవితాలు మారుతాయనీ అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది.
తెలంగాణ సమాజం మొత్తంగా దళిత సమాజం వెన్నుదన్నుగా నిలబడి దళితుల ఆత్మన్యూనతను పోగొట్టి, ఆత్మస్థైర్యాన్ని పెంచి, వారి ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పులకు దోహదపడాలనీ, అందులో భాగస్వామ్యం పంచుకోవాలనే సదుద్దేశంతో అన్ని పార్టీలను పిలిచి, రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని సీఎం అన్నారు.
ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశం పై ఆదివారం దళిత ప్రజాప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. 11 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు పార్టీలకు చెందిన పలువురు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ తపనను ఈసందర్భంగా వక్తలు ముక్తకంఠంతో అభినందించారు.
ఈ సమావేశంలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రైతుబంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు వెంకటేష్ నేత బొర్లకుంట, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్రభాకర్ రావు, డి. రాజేశ్వర్ రావు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యేలు బాల్క్ సుమన్, దుర్గం చిన్నయ్య , హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్ చంటి, కె. మాణిక్ రావు , కాలె యాదయ్య , మెతుకు ఆనంద్, జి. సాయన్న, గువ్వల బాలరాజు, విఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య ,గ్యాదరి కిషోర్ కుమార్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, మల్లు భట్టివిక్రమార్క, సండ్ర వెంకట వీరయ్య, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి ,
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపి మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కృషాంక్, శ్రీధర్ రెడ్డి, సీపిఎం పార్టీ నేతలు బి. వెంకట్, జాన్ వెస్లీ, సిపిఐ నేత బాలనర్సింహా లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, శేషాద్రి, ప్రియాంక వర్గీస్, శ్రీధర్ రావు దేశ్ పాండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఎండి కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరక్టర్ ఉమా దేవి, జి. టి. వేంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ “ దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతీ ఒక్కరినీ కలచి వేసే విషయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధిస్తున్నది. ఇంకా దారిద్ర్యరేఖకు దిగువన, బాటమ్ లైన్లో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన నడిపించడమే ప్రధాన ధ్యేయంగా 1200 కోట్ల రూపాయలతో ‘సీఎం దళిత సాధికారత పథకం’ ప్రవేశపెడుతున్నాం” అని స్పష్టం చేశారు.
సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అనీ, నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయనీ, అందుకు బాధ్యులు పాలకులే అవుతారని సీఎం కెసిఆర్ అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులేనని ఆయన అన్నారు. ఈ బాధలు పోవాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు.
“దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలిగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. “ మేము కూడా ముందుకు పోగలం” అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో అఖిలపక్షం సూచనలు చేయాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలుపరుద్దాం. నిధుల బాధ్యత నాది. పార్టీలు రాజకీయలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనమందరం తీసుకుందాం” అని సీఎం అఖిలపక్షానికి సూచించారు.
“రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను మొట్ట మొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని ఎకరాలున్నాయి? ఇందులో ఉన్నదెంత? పోయిందెంత? లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎస్సీ భూముల్లో నీళ్ళు లేని, నీళ్ళు ఉండి ఇతర వసతులు లేని భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలి. రాష్ట్రమంతా అవసరమైతే పది పదిహేను రోజులు భూముల లెక్కల మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదే సిద్ధం చేసుకోవాలి. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం గా వుంది. ఇందుకు సంబందించిన సమిష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలె..’’ అని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.
కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం అభివ్రుద్ది చెందడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూమిమీద ఆధారపడి జీవనోపాధి రోజు రోజుకు పెరుగుతున్నదని సిఎం అన్నారు. పట్టణాల్లో మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి కోసం అన్వేషించాలని సూచించారు. గోరేటి వెంకన్న ‘గల్లీ చిన్నది..’ పాట ను మనసు పెట్టీ వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని సీఎం అన్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడి గా గుర్తించి పరిష్కారాలు వెతకాలనీ, దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలని సీఎం సూచించారు. దళితుల అభ్యున్నతికి సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలనుకుంటున్నామని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా లబ్దిదారులక ఆర్థిక సాయం అందే విధంగా అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులను సీఎం కోరారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలన్నారు. అట్టడుగున వున్న వారి నుంచి సహాయం ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సీఎం తెలిపారు.
“ఈ బడ్జెట్ లో సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి రూ.1200 కోట్లు కేటాయించాం. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ కేటాయింపులు ఎస్సీ సబ్ ప్లాన్ కు అదనం. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేయడానికి నిశ్చయించుకున్నది. మీరందరూ కలిసి రావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి, సిఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే నా దృఢ సంకల్పం” అని అఖిలపక్షాన్ని ఉద్దేశించి సీఎం కెసిఆర్ అన్నారు.
సీఎం కెసిఆర్ సఫాయి కార్మికుల పై తనుకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. “సఫాయన్న నీకు సలాం అన్న” అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతీసారీ వాళ్ళ జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామని అఖిల పక్షంలో వచ్చిన అభ్యర్ధన మేరకు సిఎం తెలిపారు. ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలు అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కూడా ఇదే సందర్భంలో సీఎం అన్నారు. “అద్దాల అంగడి మాయా లోకం మోపైంది. ఈ పోటీ ప్రపంచం, కరోనా నేపథ్యంలో దళిత బిడ్డలు నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎటువంటి బ్యాంకు గ్యారంటీల జంఝాటం లేకుండానే సీఎం దళిత సాధికారత పథకం ద్వారా కడునిరుపేద దళిత కుటుంబాలకు సహకారం అందిస్తాం” అని సీఎం హామీ ఇచ్చారు.
‘సెంటర్ ఫర్ దలిత్ స్టడీస్’ అనుసరించిన విధానాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అనుసరిస్తూ, దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకొని, కమిట్ మెంట్ వున్న అధికారులను నియమించుకోవాలని సూచించారు. “దళిత సాధికారత కోసం, దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అవకాశాలను అందుకునే దిశగా.. చైతన్యం చేయాలి. ఆ దిశగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి. పాటలు, కళా రూపాల ప్రదర్శన, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య కార్యక్రమాలను రూపొందించాలి. దళితుల చైతన్యం కోసం గోరేటి వెంకన్న వంటి కవులను, సాంస్కృతిక సారథి, తదితర కళాకారుల సేవలను వినియోగించుకోవాలి. దళిత యువత ఆలోచనా దృక్పథం లో గుణాత్మక మార్పు కు, ఆత్మ న్యూనత నుంచి ఆత్మ స్థైర్యం పెరిగి, ఉన్నత స్థాయి ఓరియంటేషన్ అలవర్చుకునే దిశగా చర్యలు చేపట్టాలి” అని సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న, ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ పొందేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇన్ కమ్ సీలింగ్ లో సడలింపు అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు.
వ్యవసాయం సాగునీటి రంగాలను చక్కదిద్ది, ఇరిగేషన్ రంగాన్ని పట్టు బట్టి గాడిలో పెట్టినట్టు, దళితుల సాధికారత కోసం కూడా ప్రభుత్వం అంతే పట్టుదల తో పని చేయాలని నిర్ణయించిందని సీఎం తెలిపారు. వ్యాపార నిర్వహణ కోసం, తదితర స్వయం ఉపాధి రంగాల ఏర్పాటు కోసం, ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్స్ లు, అందించే పెట్టుబడులు, మొదలైన అంశాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్స్ కోటా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.