Sunday, May 19, 2024
HomeTrending NewsBabu Fire: రైతుల కష్టార్జితం ధారాదత్తం: బాబు

Babu Fire: రైతుల కష్టార్జితం ధారాదత్తం: బాబు

రాష్ట్రంలోని డెయిరీలను, వాటి ఆస్తులను అమూల్ సంస్థకు కట్టబెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దాదాపు 6వేల కోట్ల రూపాయల ఆస్తులనుఅమూల్, దాని అనుబంధ సంస్థలకు  సిఎం జగన్ ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. రైతుల ఆస్తులను, వారి కష్టార్జితాన్ని అమూల్ కు ఇచ్చే అధికారం ఎవరిచ్చారని, ఇదేమైనా ఆయన తాత జాగీరా అంటూ నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీని అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ మాత్రం ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు.  హెరిటేజ్ సంస్థ 9 రాష్ట్రాలలో వ్యాపారం చేస్తోందని, కానీ ఇక్కడ ఆ సంస్థను బూచిగా చూపిస్తూ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం తెలుగుజాతికి  చేస్తున్న ద్రోహం అని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పలువురు కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పోలవరం పూర్తి చేసి గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేసి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయి ఉండేదని కానీ ఈ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రొద్దుటూరు నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు టిడిపిలో చేరడం ఆనందంగా ఉందని, లోకేష్ అక్కడ పాదయాత్ర చేస్తే కోడిగుడ్లు వేశారని,  అలిపిరిలో  క్లెమోర్ మైన్స్ పేల్చినప్పుడే తాము భయపడలేదని, ఇంక కోడిగుడ్లకు భయపడతామా అని ఎద్దేవా చేశారు.  జగన్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని,  ప్రతి రెండేళ్ళకోసారి పార్టీ అధ్యక్షపదవికి ఎన్నికలు జరగాలని, కానీ వైసీపీకి జీవిత కాల అధ్యక్షుడిగా జగన్ ను ఎన్నుకుంటే… ఎన్నికల సంఘం చివాట్లు పెట్టిందని బాబు గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ముఖ్యమంత్రి ఇంటికి పోవడం ఖాయమని బాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారో అర్ధం కావడం లేదని, ముందస్తు ఎన్నికలు అంటూ లీకులు ఇస్తారని, ఆ తర్వాత దాన్ని ఖండించేది కూడా వారేనని బాబు పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వంలో అధికారులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని, తాడిపత్రి  సిఐ ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్