Saturday, November 23, 2024
HomeTrending NewsCM Delhi Tour: విభజన హామీలు త్వరగా తేల్చండి: సిఎం 

CM Delhi Tour: విభజన హామీలు త్వరగా తేల్చండి: సిఎం 

విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి  ముఖ్యమంత్రి తీసుకెళ్ళారు.

ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సిఎం జగన్‌. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటా 20 నిమిషాలసేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.  ఈ సమావేశానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై దాదాపు 45 నిమిషాలసేపు చర్చించారు. ప్రధానితో సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సిఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

  1. పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్‌ చేయాలని
  2. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే వచ్చేలా దృష్టిపెట్టాలని
  3. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపంవల్ల  రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్‌ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, సత్వరమే జోక్యంచేసుకోవాలని
  4. ప్రత్యేక హోదా సహా… పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని
  5. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామని, ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉందని గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని వీటికి తగిన ఆర్ధిక సహాయం చేయాలని
  6. వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి అవసరమైన ముడి ఖనిజంకోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వాలని
  7. ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరుచేయాలని

ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఈ వరుస భేటీల అనంతరం ఢిల్లీ పర్యటనముగించుకుని తిరిగి తాడేపల్లికి   ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్