గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు అద్భుత స్పందన లభించిందని, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని మరోసారి రుజువైందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై విశ్వాసం ప్రదర్శించినందుకు పారిశ్రామిక వేత్తలకు సిఎం కృతజ్ఞతలు తెలియజేశారు. 15 రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై వివరించగలిగామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటినుంచీ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని తీసుకు వచ్చామని, కోవిడ్ మహమ్మారి సమయంలోనూ పారిశ్రామిక ప్రగతి మందగమనంలోకి వెళ్ళకుండా ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు. తమ విధానాలతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో ఉందని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో భాగంగా నేడు జరిగిన ముగింపు సమావేశంలో సిఎం ప్రసంగించారు.
ఈ రెండు రోజుల్లో 352 ఎంవోయూలు చేసుకున్నామని, వీటి ద్వారా 13, 05, 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 6, 02, 023మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వీటిల్లో ఎనర్జీ రంగంలో 40 ఒప్పందాలు ఉన్నాయని, 8.84 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. పునరుత్పాదక రంగంలో ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించగలిగామన్నారు. ఒప్పందాల స్టేజ్ నుంచి అతి త్వరలోనే ఇవన్నీ గ్రౌండింగ్ స్థాయికి వెళ్లాలని సిఎం ఆకాంక్షించారు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, అవసరమైన అన్ని అనుమతులూ లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంవోయూలు వేగంగా కార్యరూపం దాల్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, సిఎంవో అధికారులు, పరిశ్రమల శాఖా ప్రత్యేక కార్యదర్శి కూడా దీనిలో ఉంటారని చెప్పారు. సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు.