Jagananna Vidya Kanuka:
గతంలో ఆర్ధిక భారం వల్ల ప్రైవేటురంగంలో ఉన్న సుప్రసిద్ధ కాలేజీలు, యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ప్రైవేటు యూనివర్శిటీల్లో….. మెడికల్, డెంటల్ అయితే కచ్చితంగా యాభైశాతం సీట్లు… ఇంజనీరింగ్, డిగ్రీ వంటి ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు కచ్చితంగా కన్వీనర్ కోటా కింద పేద విద్యార్ధులకు కేటాయించేలా చట్టం చేశామని గుర్తు చేశారు. దీనివల్ల ఇంతకుముందు అవకాశంలేని పేద విద్యార్థులకు అవకాశం వస్తోందని, ఈ ఏడాది దాదాపు 2118 విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చేరారని వివరించారు. వీరికి పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తున్నామని, గతానికి భిన్నంగా ప్రతిభ ఉన్న అర్హులైన పేదవిద్యార్థులకు చదువుకునే అవకాశం లభించిందని వివరించారు.
ఈ ఏడాది జగనన్న విద్యాదీవెనలో భాగంగా మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ.686 కోట్లను క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు సిఎం జగన్. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
పిల్లలను డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీల్లో చదివించాలంటే, బోర్డింగ్, మెస్ ఖర్చులు సంవత్సరానికి రూ.20వేలు దాకా అవుతున్నాయని, అవి కూడా చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని, ఈ కారణంగానే జగనన్న వసతిదీవెన పథకం పెట్టామని సిఎం తెలిపారు. ఐటీఐ చదివేవారికి రూ.10వేలు, పాలిటెక్నిక్ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్,మెడిసిన్ ఇలా ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. ఈ వసతి దీవెన పథకంలో ఇప్పటివరకూ రూ.2267 కోట్ల రూపాయలు ఇప్పటివరకూ నేరుగా తల్లుల ఖాతాల్లోకి పిల్లల తరపున జమ చేశామని వివరించారు. విద్యాదీవెన, వసతి దీవెన ఈరెండు పథకాలకే కలిపి ఈ రెండున్నర ఏళ్లలో రూ.8526 కోట్లకుపైగా ఇచ్చామని పేర్కొన్నారు.
Also Read : నేడు మూడో విడత విద్యా దీవెన