Answer this: కాంట్రాక్టర్ ను మార్చడమే పోలవరం ప్రాజెక్టుకు శాపమని నిపుణుల కమిటీ తేల్చిందని, ప్రాజెక్టు నిర్మాణంలో విధ్వంసం జరిగిందని ఇది మాటలకందనిదని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఐటి ఆధ్వర్యంలో ఈ కమిటీ దాదాపు పది సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, 124 పేజీలతో పోలవరం ప్రాజెక్టు పై ఓ సమగ్ర నివేదిక రూపొందించారని ఉమా గుర్తు చేశారు. 53 రోజులపాటు వారు ఈ పరిశోధన చేశారని, గత ప్రభుత్వం హయంలో జరిగిన పనులన్నీ సమర్ధవంతంగా జరిగాయని, స్పిల్ వే ద్వారా నీళ్ళు వెళ్లాయని ఈ నిపుణులు తేల్చారని ఉమా వెల్లడించారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల, తప్పుల వల్ల, ప్రణాళిక లేమి వల్ల, సమన్వయం లేకపోవడం వల్ల, నిర్మాణ సంస్థను మార్చడం వల్ల సరిదిద్దుకోలేని తప్పు జరిగిందని స్పష్టం చేశారు.
50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, 50లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే విధంగా డిజైన్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యంపై జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం చేయడం వల్ల, నీరు నిలబడి పని చేయాల్సిన ప్రాంతం అంతా కూడా మునిగిపోయిందన్నారు. నిర్మాణ ఏజెన్సీ లను మార్చ వద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సూచనలను సైతం పక్కన పెట్టారని, చారిత్రాత్మక తప్పిదం చేశారని ఉమా మండిపడ్డారు. తాము అధికారంలోని వచ్చే నాటికి 7శాతం మాత్రమే పూర్తయిన పోలవరం పనులను తాము 72శాతం పూర్తి చేశామని ఉమా చెప్పారు.
పోలవరం ముంపు గ్రామాల్లో ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణాలో కలపమని డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రాజెక్టు జాప్యంపై సిఎం జగన్ స్పందించాలని, మీడియా ముందుకు రావాలని సూచించారు.
Also Read : పోలవరం గోదారి పాలైంది: బాబు ఎద్దేవా