సిఎం పీఠంలో చంద్రబాబు లేకపోవడాన్ని పచ్చమీడియా జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలో మీడియా వక్రీకరణ ఎక్కువైపోయిందని మండిపడ్డారు. మనం చంద్రబాబుతో పాటు దురదృష్టవశాత్తూ మీడియాతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందని పునరుద్ఘాటించారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష చేపట్టారు. ఆర్‌అండ్‌బి, పెట్టుబడులు, మౌలిక వసతులపై కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, శంకర్ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం మట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధిని విస్మరించారని అందుకే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మనం అధికారంలోకి వచ్చిన దేవుడి దయవల్ల వర్షాలు బాగా పాడడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. వర్షాలు వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, వనరుల సమీకరణ కోసం అనేక చర్యలు తీసుకుందని, ఒక నిధిని కూడా ఏర్పాటు చేసిందని సిఎం వెల్లడించారు.
రోడ్ల విషయంలో కూడా ఎల్లో మీడియా వక్రీకరణ చేస్తూ తమ ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం చేస్తోందని, దీన్ని పాజిటివ్ గా తీసుకొని మన పని మనం చేద్దామని పిలుపు ఇచ్చారు. బాగా పని చేసి నిర్ణీత సమయంలో రోడ్లు బాగుచేసి చూపిద్దామని, అప్పుడు నెగెటివ్ ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. వర్షాలు తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన రోడ్లు బాగు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని, వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, ఇంకా టెండర్లు పిలవని చోట వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. మళ్ళీ వచ్చే వర్షాకాలం నాటికి రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు అన్నింటినీ బాగు చేయాలని ఆదేశించారు.
సంబంధిత ప్రభుత్వ విభాగాలు అన్నీ సమన్వయం చేసుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని, ఆయా నివేదికల ఆధారంగా ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్లను బాగు చేయాలన్నారు.