CM Jagan on Viveka Murder:
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తనకు స్వయానా చిన్నాన్న అని, మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి తన సోదరుడని, తమ బాబాయి హత్యతో తమకు ఎలా సంబంధం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ సందర్భంగా నేడు జరిగిన పరిణామాలను జగన్ ప్రస్తావించారు. వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని, వివేకా హత్యపై చంద్రబాబు పదే పడే మాట్లాడడం సరికాదని ఆవేదనతో అన్నారు. నాడు కడప జిల్లాలో వైఎస్సార్సీపీకి ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటే వారిని కొనుగోలు చేసి తన చిన్నాన్న వివేకాను ఎమ్మెల్సీ గా ఓడించింది తెలుగుదేశం పార్టీ కాదా అని ప్రశ్నించారు. ‘వివేకాగారు నాకు చిన్నాన్న, చంద్రబాబుగారికి కాదు, సొంత మా నాన్న తమ్ముడు… ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు అధ్యక్షా… మన చేయితో మనకున్న కంటిని ఎందుకు పొడుచుకుంటాం:’ అంటూ జగన్ విపక్షాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు…
- వివేకా గారి హత్య జరిగింది చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాం
- మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే.. అది వాళ్లే చేసి ఉండాలి
- ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది
- అలాంటి విషయాలను కూడా ఇక్కడ ట్విస్ట్ చేసి, రాజకీయంగా మాట్లాడతారు
- ఇది చాలా దురదృష్టకరం
- చివరకు మాకుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలను చేస్తున్నారు
- అయినా పైన దేవుడు ఉన్నాడు.. ఆయనే చూస్తాడు
- చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు ఆయనకు పొలిటికల్ అజెండానే ముఖ్యం
- ఇటీవలి ఎన్నికల్లో, చివరకు కుప్పంలో కూడా చంద్రబాబు ప్రజల వ్యతిరేకత చూశారు
- మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయింది
- మండలిలో కూడా వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగింది
- కౌన్సిల్ ఛైర్మన్‌గా వైయస్సార్‌సీపీకి చెందిన నా సోదరుడు, దళితుడు రాబోతున్నాడు
- ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారు
- ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థంకావడంలేదు
- సంబంధంలేని టాపిక్‌ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారు
- దాన్ని ఖండిస్తూ అధికార పక్షంనుంచి కూడా కొంతమంది మాట్లాడతారు
- తానంతట తానే సభలో వాతావరణాన్ని చంద్రబాబు రెచ్చగొడతారు
- చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికారపక్షం నుంచి మాట్లాడలేదు
- మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డిగారి హత్య అయితేనేమి, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపైకూడా చర్చజరగాలని అధికారపార్టీ సభ్యులు అన్నారు
- చంద్రబాబు రెచ్చగొడుగుతున్నారు కాబట్టే ఈమాటలన్నారు
- ఎక్కడా కూడా కుటుంబ సభ్యులగురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదు
- కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబుగారు మాట్లాడారు తప్ప, ఇంకెవ్వరూడా కూడామాట్లాడలేదు
- మా చిన్నాన్న గురించి, మా అమ్మగురించి, మా చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారు
- అధికారపక్షంనుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదు…సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుంది
- మా వాళ్లు అందరూ కూడా ఇదే చెప్పారు…. వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారు
- ఇవన్నీ మన కళ్లముందే చూశాం…. ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు
- నేను అయినా, ఎవరైనా అంతా నిమిత్త మాత్రులమే
- దేవుడు ఎంతకాలం అయితే ఆశీర్వదిస్తాడో.. అంతకాలం మనం పనిచేయగలుగుతాం:
- దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు రాజకీయాల్లో ముఖ్యం
- ఎంతకాలం మనం మంచి చేస్తే.. దేవుడు ఆశీర్వదిస్తాడు.. ఆ మంచి జరిగిన కాలం ప్రజలు ఆశీర్వదిస్తారు
- ఆ రెండూ ఉన్నంతకాలం.. ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు, ఇది వాస్తవం
- ప్రజలకు మంచి జరిగినంత కాలం, చంద్రబాబుగారు ఎంత డ్రామాలు చేసినా, చంద్రబాబుగారి కళ్లల్లో నీళ్లు తిరక్కపోయినా తిరిగినట్టుగా, తనంతట తానే డ్రామాలు చేయొచ్చు.. ఇలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు
- దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు ఏదో జరిగిపోయిందని చూపించవచ్చు
- ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా వాళ్లే చెప్పేయొచ్చు
- ఆయనే అన్ని మాటలు మాట్లాడతాడు, ఆయనే డ్రామా చేస్తాడు
- ఎలాంటి మాటలు మాట్లాడకపోయినా… మాట్లాడినట్టు చూపించవచ్చు….ఏమైనా జరగొచ్చు
- కాని చిట్టచివరిగా దేవుడు ఇవన్నీ చూస్తాడు… ప్రజలు చూస్తూ ఉన్నారు
- దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంతకాలం.. ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలాంటి టీవీ–5లు ఎంత చంద్రబాబుగారిని మోసినా.. అంతిమంగా మంచే విజయం సాధిస్తుంది…..
అంటూ సిఎం జగన్ వ్యాఖ్యానించారు.
Also Read : భోరున విలపించిన బాబు