గ్రామం యూనిట్‌గా వ్యాక్సినేషన్ ఇవ్వాలని, దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యతపరంగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు వృథాకాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని, 18–44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు
- ఉపాధ్యాయులు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి
- ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేదిశగా ఆలోచించాలి
- ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటాను నిక్షిప్తం చేయాలి
- క్యూఆర్ కోడ్ రూపంలో ఈ వివరాలు తెలుసుకునేలా ఉండాలి
- విలేజ్ క్లినిక్స్ లో కూడా డేటా నమోదు చేయాలి
- ప్రతి విలేజ్, వార్డు క్లినిక్ లలో తప్పనిసరిగా కంప్యూటర్ ఉంచాలి, ఆరోగ్యశ్రీ కింద ఎంపానెల్ అయిన ఆస్పత్రుల వివరాలు అందుబాటులో ఉంచాలన్న సీఎం
- ఆరోగ్యశ్రీ కార్డు నంబర్‌చెప్పినా, లేదా ఆధార్ కార్డు నంబర్ చెప్పినా వెంటనే సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలు లభ్యమయ్యే విధానం తీసుకురావాలి
- గ్రామాల్లో కాలుష్యంపై కూడా దృష్టిపెట్టాలి
- గ్రామాల్లోని నీరు, గాలి, మట్టి నమూనాలను పరిశీలించి కాలుష్య స్థాయిలపై తగిన వివరాలు తీసుకోవాలి
- శానిటేషన్ పరిస్థితులపైకూడా వివరాలు నమోదుకావాలి
- అలాగే గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి, పీరియాడికల్‌గా వీటిని శుభ్రం చేయించాలి
- విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రులు వరకూ ఉండాల్సిన సిబ్బంది ఎంత మంది ఉన్నారు, ఎంతమంది కావాలి అన్నదానిపై డేటాను తయారుచేయాలి
- పీహెచ్‌సీ నుంచి పైస్థాయి ఆస్పత్రుల వరకూ కాంపౌండ్‌వాల్ ఉండాలి అని సిఎం జగన్ సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.