ఏప్రిల్15 నుంచి రబీ సీజన్ లో పండిన ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉంటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్ పూర్తైందని వెల్లడించిన అధికారులు. అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం అంచనా వేస్తున్నామని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారుచేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదలచేస్తామని అధికారులి సిఎంకు వివరించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలని, ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సిఎం సూచించారు. ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలన్నారు.
ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీచేస్తున్నామని, 2023–24లో 10.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టామని తెలిపారు. నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు.
పొలంబడి శిక్షణ, వ్యవసాయ పరికరాల పంపిణీ, మిల్లెట్స్ సాగు, ఆర్బీకేల్లో కియోస్క్‌ల సేవలు, ఉద్యానవన పంటల మార్కెటింగ్ , ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ అంశాలపై కూడా సిఎం సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్ రెడ్డి, ఉద్యానవన శాఖ సలహాదారు శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ బి.నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్‌ఎస్. శ్రీధర్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, ఎపీఎస్‌ఎస్‌డీసీఎస్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, ఏపీ ఆగ్రోస్ వీసీ అండ్ ఎండీ ఎస్.కృష్ణమూర్తి, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.