CM Kadapa Tour: ఆదిత్య బిర్లా కంపెనీ తమ పెట్టుబడులకు పులివెందులను గమ్యంగా చేసుకున్నందుకు శ్రీకుమార మంగళం బిర్లా, ఆశీష్ బృందానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్(ఏబీఎఫ్‌ఆర్‌ఎల్) యూనిట్ ఏర్పాటుకు సిఎం జగన్ భూమిపూజ నిర్వహించారు. ‘ఇది నా నియోజకవర్గం. కుడివైపున పెద్ద హౌసింగ్ కాలనీ పరిశ్రమకూడా రాబోతుంది. దాదాపు 25 వేల మంది ప్రజలు నివసించబోతున్నారు. పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. 7400 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రభుత్వమే స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ నిర్మిస్తుంది. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని సహాయంతో మీరు మా మనుషులకు శిక్షణ అందించే అవకాశం ఉంది’ అని సిఎం పేర్కొన్నారు.
ఆదిత్య బిర్లా గ్రూప్‌కు అలాట్‌మెంట్ లెటర్‌ను సిఎం అందజేశారు. ఈ కంపెనీ ద్వారా దాదాపు 2వేల మందికి ఉద్యోగాలు వస్తాయ్తని సిఎం వెల్లడించారు. ఈ కంపెనీ మరింత అభివృద్ధి చెంది ఒక్క పులివెందులలోనే పదివేల మంది వరకూ ఉపాధి కల్పిస్తుందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరులను తీర్చి దిద్దడం కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ చొప్పున రాష్ట్రంలో 26 కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఒకటి పులివెందులలో కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కాలేజీలో తమ కంపెనీ కి కావాల్సిన స్కిల్స్ లో తర్ఫీదు ఇవ్వవలసిందిగా ఆదిత్యా బిర్లా గ్రూప్ యాజమాన్యానికి సిఎం విజ్ఞప్తి చేశారు.
మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా నేడు సిఎం జగన్ పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ లో తన తండ్రి దివంగత నేత వైఎస్ సమాధి వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు.
పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న హౌసింగ్ లే అవుట్ ద్వారా 8042 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు.
Also Read : రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధ : అనిల్