మహారాష్ట్ర రాజకీయాలు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు (సోమవారం) నిర్వహించిన బలపరీక్షలో సీఎం షిండే నెగ్గారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. షిండేను మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు సమర్థించారు. దీంతో ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. డివిజన్ ఆఫ్ వోటింగ్ కోసం ప్రతిపక్షం డిమాండ్ చేయగా స్పీకర్ అందుకు అనుమతించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే శనివారం నాడు ప్రమాణస్వీకారం చేయగా, గవర్నర్ ఆదేశాల మేరకు బలపరీక్ష నిమిత్తం రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్పీకర్ ఎన్నిక జరగ్గా.. బిజెపి అభ్యర్థి రాహుల్ నర్వేకర్ గెలుపొందారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియ చేపట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. సీఎం షిండేకు అనుకూలంగా 164 ఓట్లు రాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. సభకు హాజరైనవారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తంగా 164-99 తేడాతో షిండే విశ్వాస పరీక్షలో నెగ్గారు.
Also Read : ‘మహా’ సిఎంగా ఏక్ నాథ్ షిండే