ఏఐసిసి ఇచ్చిన షోకాజ్ నోటీసులను తాను ఎప్పుడో చెత్తబుట్టలో పడేశానని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ థాక్రే ను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటినుంచి పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతోందని, తమకు తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయని కోమటిరెడ్డి థాక్రేకు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై స్పందించిన థాక్రే …ఇకపై అలా జరగదని… పార్టీకి మీ అవసరం ఉందని, మీరు ప్రజల్లోకి తిరగాలని, హై కమాండ్ అంతా చూసుకుంటుందని కోమటిరెడ్డికి సూచించినట్లు తెలిసింది.
షోకాజ్ నోటీసుల సంగతి మరచిపోవాలని, వెళ్లి పని చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తనకు గతంలోనే చెప్పారని కోమటిరెడ్డి వెల్లడించారు. పిసిసి ఆఫీసుకు వెళ్లి నాలుగైదు సార్లు ఓడిపోయినవారితో తాను కూర్చోవాలా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. నిన్న నియోజకవర్గంలో పని ఉండి థాక్రేను కలవలేకపోయానని, తనతో పాటు జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య కూడా కలవలేకపోయారని అన్నారు. ఫోటోల మార్ఫింగ్ విషయాన్ని ఏఐసిసికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తన ఫోటో మార్ఫింగ్ చేశారని స్వయంగా పోలిస్ కమిషనర్ చెప్పారని వెంకట్ రెడ్డి చెప్పారు.