కాంగ్రెస్ నేతలు ఏమైనా కేసీఆర్ ఫాం హౌస్ పై బాంబులు వేయడానికి వచ్చారా, బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులతో నేను మాట్లాడితే ప్రభుత్వానికి భయం దేనికి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సమీక్షలు పెట్టాల్సింది బీహార్ రాష్ట్ర సమితి పై కాదు… రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి పై పెట్టాలన్నారు. కాంగ్రెస్ నేతలు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బాసర వచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ప్రాంగణానికి చేరుకున్నారు. గోడదూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి ప్రవేశించి, నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించిన విషయం గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడ్నించి తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోశారు.
ట్రిపుల్ ఐటి సమస్యలకు కేంద్రంగా మారిందని, విద్యాశాఖ మంత్రి పరిష్కరించాల్సింది పోయి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడటం సహించరానిదని రేవంత్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులవి సిల్లీ సమస్యలు కాదు… ముఖ్యమంత్రి వ్యవహార శైలే సిల్లీగా ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్యాంగ్ రేపులు జరుగుతుంటే నియంత్రించలేని పోలీసు వ్యవస్థ… ప్రజా సమస్యల పై కొట్లాడుతున్న మమ్మల్ని నియంత్రిస్తోందని మండిపడ్డారు. తక్షణం మంత్రులు కేటీఆర్, సబిత బాసర త్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. త్వరలో విద్యార్థి – యువత సమస్యల పై కాంగ్రెస్ కార్యచరణ రూపొందించి, విద్యార్థి – యువత డిక్లరేషన్ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Also Read : కేసీఆర్ సర్కారుపై ట్విట్టర్‌లో రాహుల్ ఫైర్