Huzurabad Election Results 2021
…అలా డిపాజిట్ కోల్పోయిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఓటమిపై సమీక్ష మొదలయ్యింది. మేరునగధీరులని తమకు తాము అనుకునేవారందరూ ఒక్కొక్క కొండగా తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర శాఖకు జాతీయ ప్రతినిధిగా ఉన్న ఇన్ ఛార్జ్ సమక్షంలో ఒక్కొక్కరు ఒద్దికగా సీట్లలో కూర్చున్నారు.
సమావేశం ఓం ప్రథమంలోనే అలిగి ఒక పెద్ద కొండ వాకౌట్ చేసింది. మిగిలిన పెద్దలు తలుపులు బిగించుకుని చర్చించారట. స్థూలంగా ఓటమికి కారణాలను, సూక్ష్మంగా ఓటమికి కారణాలను వేరువేరుగా చర్చించారు. మీడియాకు అధికారికంగా చెప్పినవి, మీడియాకు అధికారికంగా లీకులిచ్చినవి కలిపితే ఓటమికి కారణాలు క్రింది విధముగానుండును.
1. పార్టీ రాష్ట్ర అకౌంట్లో డిపాజిట్ లేకపోవడం వల్ల…డిపాజిట్ రాలేదు అన్నది సాంకేతికంగా నిజమే కానీ…అది డిపాజిట్ లేకపోవడమే తప్ప…రాకపోవడం కాదు.
2. డిపాజిట్ లేకపోవడానికి – రాకపోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధిష్ఠానానికి అర్ధమయ్యే భాషలో వివరించడానికి ఢిల్లీకి పంపే బృందాన్ని ఎంపిక చేయడానికి ఒక ఎంపిక కమిటీని నియమించాలని నిర్ణయించారు.
3. పార్టీలో కోవర్టులకు తగిన గుర్తింపు, మీడియాలో తగిన స్పేస్ రావడం మీద సమీక్ష సమావేశం విచారం వ్యక్తం చేసి…ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది.
4. విడిపోయిన రెండు రాష్ట్రాలను వెంటనే కలపడానికి సిద్ధమని అసందర్భంగా పార్టీలో గొంతువిప్పిన నేత పార్టీని పాతాళం కిందికి తొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సమావేశం ఖండించలేకపోయింది.
5. మనం ఎలాగూ ఓడిపోయే సీటు కాబట్టి అక్కడ గెలిచేవాడే మన మిత్రుడు అని పార్టీ ఎం పి ఆవిష్కరించిన ఒక నవీన రాజకీయ సిద్ధాంతాన్ని సమావేశం అంగీకరించాలో? తిరస్కరించాలో? తెలియక తికమక పడింది.
6. పార్టీకి ఓటమి కొత్త కాదు. ఓటమితో కుంగిపోము. ఈ ఓటమి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది- అని మీడియాముందు అధికార ప్రతినిధి చెదరని చిరునవ్వుతో చెప్పారు.
7. డీ మానిటైజేషన్ వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా తగ్గాయని…వాతావరణం కొంత కుదుటపడి బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగగానే తమకు కూడా డిపాజిట్లు దక్కుతాయని సమావేశం భవిష్యత్తు మీద భరోసాను ప్రకటించింది.
8. ఇకపై పార్టీలో ఎవరూ అంతర్గత వ్యవహారాలను బయట మాట్లాడకూడదని సమావేశం నిర్ణయించిందని అధికార ప్రతినిధి ప్రకటిస్తున్న లైవ్ టీ వీ ల్లో వస్తున్న సమయంలోనే…పార్టీ అధ్యక్షుడి కుల గోత్రాలు, వంశ చరిత్ర, బలహీనతల గురించి పార్టీ నాయకుడు దూదేకుతున్న లైవ్ కూడా పక్క బాక్స్ లో సమాంతరంగా వస్తోంది!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read:
Also Read: