Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీకి సన్నాహాలు

తెలంగాణలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీకి సన్నాహాలు

రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ (నిర్మాణ రంగ యూనివర్సిటీ) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నదన్నారు.  బుధవారం మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమావేశంలో సంబంధిత అధికారులతో రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి తో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…

“భారత దేశంలో నిర్మాణ రంగం రోజు రోజుకు పుంజుకుంటుంది. ప్రపంచ దేశాలు సైతం అదునాతన టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణాలు చేస్తున్నాయి. దేశ నిర్మాణ రంగ వ్యవస్థ కూడా అంతటి అదునాతన టెక్నాలజీ అందుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా ప్రమాణాలు తేవాలని,నిర్మాణ రంగం కోసం నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయాలని కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని అదేశించారు. ప్రస్తుతం నిర్మాణం రంగంలోకి వస్తున్న వారికి పాత పద్దతిలోనే బోధన జరుగుతుంది. ఈ యూనివర్సిటీ ద్వారా ప్రపంచంతో పోటీ పడే విధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో టెక్నాలజీ విద్య అందనుంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ విద్య బోధన ఉండనుంది. కొత్త రీసెర్చ్ కోర్సులు కూడా ఇందులో ప్రవేశపెట్టొచ్చు. దీని ద్వారా నిర్మాణ రంగ ఇంజినీర్లు, నిపుణులు,సైంటిస్టులు ఎంతో మంది తయారవుతారు. తెలంగాణతో పాటు దేశ నిర్మాణ రంగ వ్యవస్థలోనే వారు కీలకం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం సకల సౌర్యాలతో,నూతన టెక్నాలజీకి తగ్గ ప్రమాణాలతో హైదరాబాద్ లోని న్యాక్ క్యాంపస్ ప్రాంగణంలోని 46 ఎకరాల్లో గల 12 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుపై పరిశీలిస్తున్నాం” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్బంగా “నిర్మాణ రంగ యూనివర్సిటీ” ఏర్పాటు స్థల మ్యాప్ ను మంత్రి పరిశీలించారు. నిర్మాణ రంగ యూనివర్సిటీ కోసం కట్టవలసిన బిల్డింగులు,ఇతర సౌకర్యాల కోసం మరియు కావాల్సిన ఫ్యాకల్టీ లకు అయ్యే ఖర్చును అంచనా వేయాలని మంత్రి అదేశించారు. కర్ క్యులం,సిలబస్,బోధనలో అదునాతన టెక్నాలజీ కి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి పలువురు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్