Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Corona Vaccination And Testing In Telangana On Sunday Too :

క‌రోనా వేళ గ‌ర్బిణుల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. వారికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా వైద్యాన్ని అందించేలా ఏర్పాట్లు చేసింది. క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన గ‌ర్భిణుల కోసం అన్ని ఆసుప‌త్రుల్లో ప్ర‌త్యేకంగా ఆప‌రేష‌న్ థియేట‌ర్లు, వార్డులు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. వీరితో పాటు క‌రోనా సోకిన ఇతర బాధితులకు అత్య‌వ‌స‌ర సేవ‌లు, శ‌స్త్ర చికిత్స‌లు అందించేందుకు కూడా ప్ర‌త్యేకంగా ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, వార్డు కేటాయించాల‌ని ఆదేశించింది. మంగ‌ళ‌వారం వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు.. హెల్త్ సెక్రెట‌రీ రిజ్వీ, డీఎంఈ ర‌మేష్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస రావుల‌తో క‌ల‌సి అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌వోలు, టీచింగ్ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్లు, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల వైద్యాధికారుల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జిల్లాల్లో క‌రోనా ప‌రిస్థితులు, వ్యాక్సినేష‌న్‌, ఆసుప‌త్రుల స‌న్న‌ద్ద‌త త‌దిత‌ర అంశాలపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ… కోవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణుల‌కు అన్ని ఆసుప‌త్రుల్లో చికిత్స అందించాలని, దీనికి అనుగుణంగా ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక‌ ఆపరేషన్ థియెటర్, వార్డును ప్రత్యేకంగా కేటాయించాల‌ని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా, అన‌వ‌స‌రంగా వారిని ఇతర ప్రభుత్వ పెద్దాస్పత్రులకు రిఫర్ చేయవద్ద‌న్నారు. ఇదే విధంగా అత్యవసర సేవ‌లు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని కోవిడ్ సోకింద‌ని చికిత్స అందించేందుకు నిరాక‌రించ‌వ‌ద్ద‌ని, వారి కోసం కూడా ప్ర‌త్యేకంగా ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న చేయాల‌ని, ప‌రిస్థితుల‌ను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల‌తో అన్ని ఆసుప‌త్రుల‌కు అస‌వ‌ర‌మైన వైద్య ప‌రిక‌రాల‌ను అందించ‌డం జ‌రిగింద‌ని, అవి పూర్తి వినియోగంలో ఉండేలా చూడాల‌న్నారు.

ఆదివారం బస్తీ దవాఖానలు, పీహెచ్ సి, సబ్ సెంటర్ సేవలు…

కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్ సిలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పని చేయాలన్నారు. వ్యాక్సినేషన్, పరీక్షలు, హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ జరగాలన్నారు. లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేసి, లక్షణాలు ఉంటే కిట్ ఇచ్చి పంపాలన్నారు.. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ పీహెచ్ సీలో రాత్రి పదింటి వరకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్ సి లో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా వచ్చి సాధారణ లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్తితి ని తెల్సుకుంటు ఉండాలన్నారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని చెప్పారు.

వాక్సినేషన్ వందకు వంద శాతం పూర్తి కావాలి..

వాక్సినేషన్ లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలని, అందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, ఇతర విభాగాలకు వంద శాతం బూస్టర్ డోస్ పూర్తి చేయాలని ఆదేశించారు. డీఎం అండ్ హెచ్ వోలు కలెక్టర్లతో మాట్లాడి మున్సిపల్ సిబ్బంది అందరికీ, జిల్లా ఎస్పీలతో మాట్లాడి పోలీసులందరికీ వందకు వంద శాతం బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పీహెచ్ సీ పరిధిలో రెండో డోస్ పెండింగ్ లో ఉండవద్దని, పీహెచ్ సీ వైద్యులే బాధ్యత తీసుకుని రెండో డోస్ వందకు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు వైద్యాధికారులను, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 15 – 17 ఏళ్ల వారికి వేసే టీకా కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పిల్లలు అంతా గ్రామాల్లో ఇంటి వద్దే ఉంటారని, పీహెచ్ సీ వైద్యులు ఇంటింటికి వెళ్లి 15 ఏళ్లు దాటిన పిల్లలందరి వాక్సిన్ ఇవ్వాలి. క్లిష్టమైన సమయంలోనే బాధ్యతతో ప్రజలకు సేవలందించాలి. ప్రజలకు ధైర్యం ఇవ్వాలి. వాక్సినేషన్ అందరికీ ఇవ్వడం ద్వారా రక్షణ కవచాన్ని మనమే ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నుండి ప్రజలను రక్షించేందుకు అవసరమైన అన్నిటినీ ముఖ్యమంత్రి సమకుర్చుతున్నారని, 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

Also Read : మధ్య తరగతి వారికి సొంతిల్లు: సిఎం జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com