Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమానవాళిపై మహా ప్రళయం- కరోనా

మానవాళిపై మహా ప్రళయం- కరోనా

2 years of Pandemic:
కరోనా మనదేశంలో అడుగుపెట్టి రెండు సంవత్సరాలు అయ్యింది.
ఈ రెండు సంవత్సరాలలో కరోనా చేసిన భీభత్సం అంతా, ఇంతాకాదు.
ఈ కరోనా కలకాలం గుర్తుండిపోయే పాఠాలు నేర్పింది.  మానవ మస్తిష్కాలపై చెరుగని ముద్ర వేసింది.
గత రెండేళ్ల కరోనా సహవాసం లో..
ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసాయో..
ఎన్ని పార్ధివ దేహాలు “అంతిమ సంస్కారాలు” లేకుండా దహనం అయ్యాయో..
ఎన్ని “అంతిమ వీలునామాలు” బలవంతంగా రాయబడ్డాయో..
ఎన్ని మనసులు క్వారంటైన్ పేరుతో, ఐసో లేషన్ పేరుతో అయినవారికి దూరంగా బిక్కు, బిక్కు మంటూ గడిపాయో..
ఎన్ని బంధాలు విచ్ఛిన్నం అయ్యాయో..
ఎన్ని కుటుంబాలు దారిద్ర్యంలోకి నెట్టబడ్డాయో..
ఎంతమంది చదువులు  చట్టబండలు అయ్యాయో..
ఎన్ని ఉద్యోగాలు ఊడాయో..
కాలే కడుపును నింపలేక ఎన్ని ప్రాణాలు విలవిలలాడాయో..
ఎన్ని చిరు వ్యాపారాలు అర్ధాంతరంగా ముగిశాయో..
ఎన్ని కంపనీలు మూతపడ్డాయో..
ఎన్ని ప్రభుత్వాలు అప్పులపాలు అయ్యాయో..
ఎన్ని దేశాలు ఆర్ధికంగా చితికి పోయాయో.. ఊహించడానికి, లెక్కలు గట్టడానికి మనకున్న అంకెలు చాలవు.   

మనిషి అన్నింటిని జయించాననుకొన్నాడు..
సృష్టిలో మిగతా జీవులన్నిటిపై ఆధిపత్యం సాధించాడు.
క్రూర జంతువులను సైతం ప్రదర్శనశాలలకు పరిమితం చేసి వినోదం చూశాడు.
భూమి పై నుంచునే నింగి, నీరు, నిప్పు, గాలి అన్నిటిని శోధించేశాడు.
పాలపుంతలను, తోకచుక్కలను కూడా పరికించేస్తున్నాడు.
ప్రకృతి వైపరీత్యాలను సైతం ముందే పసిగట్టేసి జాగ్రతలు తీసుకొంటున్నాడు.
ప్రకృతి భీభత్సాలను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిచేస్తున్నాడు.
జులుం, జులుం.  పచ్చని ప్రకృతి మీద జులుం.
చెట్టు-చేమ, నీరు-నిప్పు, నేల-నింగి, గాలి-ధూళి, జీవి-రాయి.. ఇలా ప్రతిదాని మీద జులుం.
చివరికి సాటి మనిషి పై కూడా జులుం.
తాడిని తన్నేవాడి తలను తన్నేవాడు ఉంటాడని మరిచిపోయి..
“బలవతుండ నాకేమని”, ఈ సృష్టిలో నాకు తిరుగులేదని విర్ర వీగే సమయంలో..

Covid 19 Pandemic
ఒక్కసారిగా ఓ భారీ కుదుపు..
జీవాయుధమో, జీవ ఉత్పరివర్తనమో “కరోనా” రూపంలో ప్రపంచం పై విరుచుకుపడింది.
ప్రపంచం అంతా, అన్నీ దేశాలు ముక్కూ, నోరు మూసేసుకోని,  చేతులు, కాళ్ళు కట్టేసుకొని ముడుచుకొని దాదాపు ఆరు నెలల పాటు బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.
రెండేళ్ళు పూర్తి అయినా ఇప్పటికీ దైర్యం గా తిరగలేని పరిస్థితి.
కరోనా ఈ రెండేళ్లలో ప్రపంచంలో ప్రతి గ్రామాన్ని సుడిగాలిలా చుట్టేసింది.
దాదాపు గడప గడప కు వెళ్ళి..పలుకరించి వచ్చింది.

ప్రభుత్వాలు ప్రకటించిన  తూతూ మంత్రపు లెక్కల ప్రకారమే మొత్తం ప్రపంచంలో దాదాపు 380 మిలియన్ల ప్రజలను ముక్కుల్లో తిష్ట వేసి, ఊపిరితిత్తులను ఆక్రమించి 5.6 మిలియన్ల ప్రజల జీవితాలకు అర్ధాంతర ముగింపు పలికింది.
సర్కారీ లెక్కలకు అందకుండా ఎంతమందిని మింగేసిందో ఏలినవాడికెరుక.
ఎంతమందిని జీవచ్ఛవాలుగా మార్చిందో.. ఈ లెక్కలు చిత్రగుప్తుడి చిట్టాకైనా అందుతాయా, అనుమానమే.
ముఖ్యంగా మనిషి అనే వాడిని శారీరకంగా, ఆరోగ్యపరంగా,  ఆర్ధికంగా, మానసికంగా, సామాజికంగా, మానవ సంబంధాల పరంగా పతనం చేసి, క్రుంగదీసి, కొత్త లోతులకు తీసుకు వెళ్లింది.
కాకలు తీరిన వైద్యులే కరోన కంట తమ “వంటిని” పడనీయకూడని పి‌పి‌ఈ కిట్లు ధరించి తిరగాల్సిన పరిస్థితి.
ఇక మామూలు జనం సంగతి చెప్పేది ఏముంది?

ఇక కరోనా ఎవరి ఇంటిలో అన్నా ఉన్నదంటే చాలు.. ఇక వారిని వెలివేసినట్లే.
ఆ ఇంటికే కాదు, ఆ వీధిలోకి వెళ్లాలన్నా భయమే.
అటుపక్కకు వెళ్ళడం సంగతి పక్కనబెడితే కనీసం అటు చూసే దైర్యం ఎవరికీ లేకపోయింది.
భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలు ప్రవచించే “జీవితం క్షణభంగురం” అనే సత్యం నమ్మక తప్పని పరిస్థితి.
రక్తబీజుడి ప్రతి రక్తపు చుక్క నుంచి మరో రక్త బీజుడు పుట్టికొచ్చినట్లు,  ఆ రక్తబీజుడి వారసురాలిలా అక్కడో, ఇక్కడో మిగిలిన కరోన మళ్ళీ విజృభించి.. మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్ అంటూ తరంగాలు, తరంగాలుగా జనాన్ని ముంచుతూనే ఉన్నది.
సింగల్ డోస్ లు, డబుల్ డోస్ లు, బూస్టర్ లు అన్నీ టీకాలను దాటుకోని.. మానవుడిని పట్టుకోంటూనే ఉన్నది.
కంటికి కనబడకుండా.. రెండేళ్లుగా మానవుడి పై అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉన్నది.
శాస్త్రాలు, సాంకేతికత, ఆవిష్కరణలు.. అన్నీ యుద్ధం చేస్తూనే ఉన్నాయి.
కరోనా మీద మానవుడు విజయం సాధించాడా? ఇంకా చెప్పలేని పరిస్థితి.

ఏది ఏమైనా..

ఈ కరోనా.. భవిష్యత్ తరాలకు ఒక జీవన పాఠం.
ఊహ తెలిసిన ప్రతి మనిషికి ఒక మరుపురాని పాఠం.
ప్రకృతిని పరిహసి స్తే ఎమౌతుందో చెప్పే.. ఒక అనుభవ పాఠం.
అనువుగాని చోట అధికులమని విర్రవీగే మానవజాతికి ఒక గుణ పాఠం. 

ప్రస్తుతం మూడో దశ తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ఈ మహమ్మారి ప్రభావం ఇక్కడితో ఆగిపోవాలని ఆశిద్దాం….

.. శ్రీ వెంకట సూర్య ఫణి తేజ 

Also Read : సంక్షోభంలో సంపద పాఠం

RELATED ARTICLES

Most Popular

న్యూస్