ఇది రైతు ప్రభుత్వం. సీఎం రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వమని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులు నష్టపోకుండా చివరకు పంటలు కూడా కొనుగోలు చేస్తుందన్నారు. ఇలాంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్ తప్పకుండా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారని తెలిపారు.
రైతులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడాల్సిన పనిలేదని, వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని మంత్రి వెల్లడించారు. మేమంతా అన్నదాతలకు అండగా ఉంటామని, పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసానిచ్చారు. ఇటీవలి అకాల వర్షాలకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం హరిపిరాల, కర్కాల గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ ఆయా రైతులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. మంత్రిని చూసిన రైతులు బోరుమన్నారు. తమకు పరిహారం ఇప్పించాలని తీరని, తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన తమకు అండగా నిలిచి ఆదుకోవాలని వారు విలపించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన మంత్రి ధైర్యాన్ని నింపుతూ భరోసానిస్తూ, అక్కున చేర్చుకున్నారు. ఈ పరిశీలనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : Groundnut crop: పంటల వైవిద్యీకరణకు శ్రీకారం – మంత్రి నిరంజన్ రెడ్డి