Chennai-One sided : ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ విలవిలలాడింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ధోనీ సేన 91 పరుగులతో భారీ విజయం నమోదు చేసింది.
నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు మరోసారి రాణించి భారీ స్కోరు సాధనలో గట్టి పునాది వేశారు. డెవాన్ కాన్వే 49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87; రుతురాజ్ గైక్వాడ్ పరుగులు 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 41; శివమ్ దూబే-32 పరుగులు చేశారు. అంబటి రాయుడు (5); మొయిన్ అలీ (9) విఫలమయ్యారు. చివర్లో కెప్టెన్ ధోనీ దూకుడుగా ఆడి 8 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
భారీ లక్ష్య సాధనలో తడబడిన ఢిల్లీ 16 పరుగులకే తొలి వికెట్ (శ్రీకర్ భరత్-6) కోల్పోయింది. కాసేపటికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (19) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఢిల్లీ వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. వార్నర్ తో పాటు మిచెల్ మార్ష్ (25); శార్దూల్ ఠాకూర్ (24); కెప్టెన్ పంత్ (21)… నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. దీనితో ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ మూడు, ముకేష్ చౌదరి, సిమ్రన్ జీత్ సింగ్, బ్రావో తలా రెండు; మహీష్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.
డెవాన్ కాన్వే కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : కోల్ కతాపై లక్నో ఘన విజయం