Sunday, November 24, 2024
Homeసినిమాడైలాగ్ డెలివరీతో అలరించిన తొలితరం నటుడు

డైలాగ్ డెలివరీతో అలరించిన తొలితరం నటుడు

CSR Anjaneyulu attracted with his dialogue modulation….తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన తొలితరం నటులలో సీఎస్ఆర్ ఆంజనేయలు ఒకరు. డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమనేది ఆయనతోనే మొదలైందని చెప్పచ్చు. ఆయన వాయిస్ .. ఆయన డైలాగ్ చెప్పే విధానం అంత డిఫరెంట్ గా ఉండేవి.  అలాగే అరుపులు .. కేకలు .. హంగామాలు లేకుండా విలనిజాన్ని పండించడం కూడా ఆయన నుంచే ఆరంభమైందని అనాలి. ఇక తెలుగు తెరపై ఊతపదాలు .. మేనరిజాలకు కూడా ఆయనే ఆద్యుడు .. పూజ్యుడు అని చెప్పాలి. అప్పట్లో ఆయన డైలాగ్స్ కోసమే సినిమాలను మళ్లీ మళ్లీ చూసేవాళ్లున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

సీఎస్ ఆర్ పూర్తి పేరు .. చిలకలపూడి సీతారామాంజనేయులు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆయన జన్మించారు. సీఎస్ ఆర్ తండ్రికి నాటకాలంటే ఇష్టం .. అందువలన ఆయన ఆ చుట్టుపక్కల ఎక్కడ నాటకాలు ఆడుతున్నా అక్కడికి వెళ్లేవారు. అప్పుడప్పుడు తండ్రితో కలిసి సీఎస్ ఆర్ కూడా నాటకాలకు వెళుతూ ఉండేవారు. అలా వెళ్లడం వలన ఆయనకి నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. స్కూల్ చదువులనాటికే ఆయన పాటలు .. పద్యాలు బాగా పాడేవారు. ఇక టీనేజ్ లోకి అడుగుపెట్టే సమయానికి, జానపద నాటకాలైనా .. పౌరాణిక నాటకాలైనా సీఎస్ ఆర్ వేయవలసిందే అనే పేరు తెచ్చుకున్నారు.

నాటకాలలో ఆయన డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆయన వాయిస్ ఆయనకి చాలా హెల్ప్ అయింది. ఆయన డైలాగ్స్ లోని విరుపులు ప్రేక్షకులకు గమ్మత్తుగా అనిపించాయి. నాటకాలలో రాణించినవారు సినిమాల దిశగా అడుగులు వేసినట్టుగానే ఆయన ప్రయాణం కూడా సినిమాల వైపుకు సాగింది. ‘ద్రౌపది వస్త్రాపహరణం’ సినిమాలో కృష్ణుడి పాత్రను పోషించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతకుముందు తాను స్టేజ్ పై కృష్ణుడి పాత్రను చాలాసార్లు పోషించి ఉండటం వలన, ఆయన పెద్దగా టెన్షన్ పడలేదు. పద్యాలన్నీ తనకి కంఠతా రావడం వలన ఆయన మరింత ధైర్యంతో ఉన్నారు.

అయితే స్టేజ్ పై నటించడానికి .. సినిమాల్లో కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉందనే విషయం ఆయనకి మొదటి రోజునే అర్థమైపోయింది. పద్యం ఒక తీరుగా వెళుతున్న సమయంలో కట్ చెప్పగానే ఆయన చాలా అసహనానికి లోనయ్యేవారట. మళ్లీ మూడ్ లోకి రావడానికి ఆయనకి చాలా సమయం పట్టేది. ఇక స్టేజ్ పై లా మూమెంట్స్ విషయంలో స్వేచ్ఛ లేకపోవడం ఆయనకి మరో అసంతృప్తి. ఇక సినిమాలు తనకి సరిపడవనే నిర్ణయానికి ఆయన వచ్చేశారు. హాయిగా వెనక్కి వెళ్లి నాటకాలు వేసుకోవడమంత సుఖం లేదని ఆయన భావించారు. 

ఆయనలో మంచి ప్రతిభా పాటవాలు ఉన్నాయనీ, ఒకటి రెండు రోజులు సర్దుకుంటే ఎలా చేయాలనే పట్లు అర్థమైపోతాయనీ, తొందరపడొద్దని సన్నిహితులు చెప్పారట. దాంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. అలా కాస్త ఓర్పుతో ఆయన ‘ద్రౌపది వస్త్రాపహరణం’ పూర్తి చేసి ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాగా ఆడినప్పటికీ, వరుస అవకాశాలతో  నిలదోక్కుకోవడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులను  తట్టుకున్నారు.  హీరోగా మాత్రమే చేస్తామంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదోక్కుకోలేమనే విషయాన్ని ఆయన చాలా తక్కువ సమయంలోనే గ్రహించారు.

అప్పటి నుంచి ఆయన కేరక్టర్ ఆర్టిస్టుగా ముందుకువెళ్లారు. విలన్ గా .. కామెడీ విలన్ గా ఆయన ఇక తనకి తిరుగులేదని పించుకున్నారు. ‘హే రాజన్ .. శృంగార వీరన్’ అంటూ ‘జగదేక వీరుని కథ’లో మంత్రి పాత్రలో, ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉందిగా’ అంటూ ‘మాయా బజార్’లో శకుని పాత్రలో, ‘నమ్మిన చోట చేస్తే మోసం .. నమ్మని చోట చేస్తే లౌక్యం’ అంటూ ‘కన్యాశుల్కం’లో ఆయన చేసిన హడావిడిని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇక ‘ఇల్లరికం’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలు కూడా ఆయన నటనకి నిలువెత్తు నిర్వచనమై నిలుస్తాయి.

పెద్దరికం ముసుగులో కుట్రలు .. కుతంత్రాలు చేసి, అవతలవాడిని పడగొట్టే పాత్రలలో సీఎస్ఆర్  తిరుగులేదనిపించుకున్నారు. మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించే పాత్రలలోను .. తప్పును కప్పిపుచ్చుకునే సన్నివేశాల్లోను ఆయన నటనను అభినందించకుండా ఉండలేం. తెలుగు తెరపై శకుని పాత్రకు ఆయన పెద్దబాలశిక్ష వంటివారు. ఆ తరువాత కాలంలో ఆ పాత్ర ఎవరు చేయవలసి వచ్చినా, ఆయన పోషించిన పాత్రను చూసిన తరువాతనే ముందుకు వెళ్లారు .. అదీ ఆయన గొప్పతనం. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఒకసారి వినేసి చెప్పడం ఆయన ప్రత్యేకత అంటారు. 

ఇక తెరపై ఆయన ఎంత కఠినంగా కనిపిస్తారో .. బయట అంత సున్నితమైన మనసున్నవారని చెబుతారు. అవకాశాల కోసం వచ్చి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నవారికి వెంటనే సాయం చేసేవారని అంటారు. ఇక ఆయన దగ్గరున్న మరో గొప్పగుణం ఏమిటంటే, అందరితో కలుపుగోలుగా ఉండటం. తాను పెద్ద స్టార్ ననే విషయాన్ని ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గర చూపించేవారు కాదట. ‘నాటకాల నుంచి వచ్చినవాడిని .. జీవితమే ఒక నాటకమని తెలిసినవాడిని .. నాకెందుకయ్యా చింత’ అనేమాట తరచూ అంటూ ఉండేవారట.

జీవితంలో అవమానాలు .. అభినందనలు అనుభవాలుగా చదువుకున్నవారాయన. పరిస్థితుల ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో .. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ప్రత్యక్షంగా చూసినారాయన. అందువల్లనే చివరి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా వాటిని కూడా తట్టుకుని నిలబడ్డారు. ఏదేవైనా టాకీలు మొదలైన తొలినాళ్లలో .. తెరపైకి వచ్చిన తొలితరం నటుల్లో సీఎస్ఆర్ ఒక ఆణిముత్యం .. ఒక జాతిరత్నం అని చెప్పొచ్చు. ఈ రోజు (అక్టోబర్ 8) ఆయన వర్ధంతి .. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.

(సీఎస్ ఆర్ ఆంజనేయులు వర్ధంతి ప్రత్యేకం)

–  పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్