మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరో తుఫాను ముంచుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముంచుకొస్తున్న మరో తుఫాను.. ఈసారి బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఈ నెల 13వ తేదీన ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని ప్రకటన విడుదల చేసింది.
దీంతో ఇప్పుడు మరోమారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. శ్రీలంకను ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని డెల్టా జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మాండూస్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో వర్షాలు దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా డిసెంబర్ 13, 14 తేదీలలో అండమాన్ నికోబార్ లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.