విష్వక్ సేన్ హీరోగా రూపొందిన ‘దాస్ కా ధమ్కీ‘ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. విష్వక్ రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాకి ఆయనే దర్శకుడు .. నిర్మాత. తాను ఇంతవరకూ సంపాదించినదంతా ఈ సినిమాపై పెట్టినట్టుగా ప్రమోషన్స్ సమయంలో విష్వక్ చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. సినిమా రిలీజ్ కి ముందురోజు వరకూ కూడా సమయాన్ని వృథా చేయకుండా కష్టపడ్డాడు.
అయితే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను ఆశించినస్థాయిలో ఆయన మెప్పించలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. నటన పరంగా విష్వక్ మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే .. మాటల పరంగాను, డైరెక్షన్ పరంగాను విష్వక్ వైపు నుంచి కాస్త అసంతృప్తి కనిపిస్తుంది. ‘ఇలాంటి సినిమాలు ఇంతకుముందు చాలా సినిమాలు చూశాం గదా’ అనే ఆలోచనలోనే ప్రేక్షకులు ఇంటర్వెల్ వరకూ ఉంటారు. అంత సాదా సీదాగా ఈ కథ నడుస్తుంది.
ఇంటర్వెల్ లో అదిరిపోయే బ్యాంగ్ ఉంటుందనీ .. సెకాండాఫ్ లో ట్విస్టులు ఉంటాయని తెలియని ఆడియన్స్ కథను ఫాలో అయ్యే విషయంలో అసహనంతోనే ఉంటారు. ఇక ఇంటర్వెల్ తరువాత కథలో నాటకీయ పరిణామాలు మోతాదుకి మించి జరిగిపోతుంటాయి. కథనం … పాత్రలను డిజైన్ చేసిన తీరు బలహీనంగా అనిపిస్తాయి. విష్వక్ పోషించిన రెండు పాత్రల మధ్య, లుక్ పరంగా పెద్ద తేడా లేకపోవడం మైనస్. మొదటి నుంచి చివరి వరకూ విష్వక్ ఖర్చుకు వెనుకాడలేదు. కానీ కథపై ఇంకాస్త కసరత్తు జరిగి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.