Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మూడు మ్యాచ్ ల్లో తమిళ్ పై ఢిల్లీ; బెంగాల్ పై ముంబై; తెలుగు పై పూణే విజయం సాధించాయి.
దబాంగ్ ఢిల్లీ – తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 32-31తో ఢిల్లీ గట్టెక్కింది. ప్రథమార్ధంలో ఢిల్లీ సత్తా చాటి 17-10తో ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో తమిళ్ జట్టు పుంజుకొని గట్టి పోటీ ఇచ్చి 21-15తో పైచేయి సాధించినప్పటికీ ఒక పాయింట్ తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ -13; తమిళ్ ఆటగాడు మంజీత్-10 పాయింట్లతో రాణించారు.
యూ ముంబా– బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 41-34తో ముంబై గెలుపొందింది. ఆట తొలి భాగంలో 17-16 తో బెంగాల్ స్వల్ప ఆధిక్యం సంపాదించింది. చివరి భాగంలో ముంబై సత్తా చాటి 23-15తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 7 పాయింట్ల తేడాతో యూముంబా విజయం సాధించింది. ముంబై రైడర్లు అజిత్-8; అభిషేక్ సింగ్, ఫాజల్ చెరో 8 పాయింట్లు సాధించి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
పునేరి పల్తాన్ – తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో 51-31 తేడాతో పూణే ఘనవిజయం సాధించింది. ప్రధమార్ధంలో 22-15 తో పైచేయి సాధించిన పూణే ద్వితీయార్ధంలో మరింత దూకుడు ప్రదర్శించి ఆడి 29-16తో దూసుకుపోయింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి 20 పాయింట్ల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది. పూణే ఆటగాళ్ళు మోహిత్ గయట్-14; అస్లాం ఇమాందార్-11 పాయింట్లు సంపాదించి సత్తా చాటారు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (70 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (65); హర్యానా స్టీలర్స్(58); యూపీ యోధ (57); బెంగుళూరు బుల్స్ (55); యూ ముంబా (53) టాప్ సిక్స్ లో ఉన్నాయి.