తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్న కేటీఆర్, ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతుందన్నారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటు అందించేందుకు వచ్చే బడ్జెట్లో ఐనా సరిపోయే అన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్, వరంగల్, ఇతర పురపాలికల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడమో… లేదంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ఐనా కేటాయించాలన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చెయ్యి చూపినా కూడా పురపాలికలతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి ప్రయాణాన్ని కొనసాగిస్తుందన్నారు.
47% రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాల్లో వాటిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న కేటీఆర్, ఇందుకోసమే నూతన మున్సిపాల్ చట్టం, నూతన భవన నిర్మాణ అనుమతుల చట్టం, ప్రతీ పట్టణం కచ్చితంగా ఖర్చు చేయాల్సిన 10% గ్రీన్ బడ్జెట్, టిఎస్ బి పాస్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు. భవిష్యత్ అంచనాలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 68 పురపాలికలను 142 కు పెంచుకున్న విషయాన్ని తన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం దాదాపు 3,777 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో కనీసం 20 శాతం అంటే 750 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలి.
స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన స్కైవాక్, ఫ్లై ఓవర్లు, జంక్షన్ ల అభివృద్ధి మొదటి దశ పూర్తయింది. ఇంతటి భారీ కార్యక్రమానికి బాండ్స్, రుణాల రూపాల్లో డబ్బులను జిహెచ్ఎంసీ సమకూర్చుకుంటోంది. ఇప్పటిదాకా పూర్తైన మొదటి దశ ఎస్ఆర్డీపీకి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఒక్క రుపాయి కూడా అందలేదు. ఎస్ఆర్డీపీకి రెండవ దశకైనా భారీగా నిధులు ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్ట్ సిద్ధంగా ఉంది. ఎనిమిది సంవత్సరాలుగా వివిధ అంశాల పైన ప్రత్యేక ఆర్థిక మద్దతు కోసం అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి నిరాశపడ్డామన్న కేటీఆర్, రానున్న 2023-24 బడ్జెట్లో ఐనా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.