ధరల పెరుగుదలపై లోకసభలో వాడివేడిగా చర్చ జరిగింది. చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటుగా విమర్శలు చేశాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఈజ్ వెల్ అనే విధంగా మభ్యపెడుతోందని విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదలకు పెద్ద నోట్ల రద్దు కూడా ఒక కారణమని ఎన్ సి పి సభ్యురాలు సుప్రియ సులే అన్నారు. నోట్ల రద్దు సమయంలో భారత వృద్ది రేటు మూడు శాతంగా ఉంటే బంగ్లాదేశ్ వృద్ది రేటు 8 శాతంగా ఉందని గుర్తు చేశారు.
ధరల పెరుగుదల అంశంపై చర్చ సందర్భంగాటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో వంద శాతం ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. ధరల పెరుగుదలతో కామన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారన్నారు. గోధుమ, బియ్యం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిందని, కానీ తెలంగాణలో వంద శాతం పెరిగిందన్నారు. ఎరువులపై మరింత భారం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. వంటగ్యాస్ ధర వెయ్యి దాటిందని, పేదలు ఎలా బతుకుతారని ఆయన అడిగారు.
ధరల పెరుగుదల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెరగలేదని ప్రభుత్వం సభలో చెప్పడం దారుణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి ఒక శాతం తగ్గిందని, దేశంలో ఉత్పత్తి మాత్రం బాగుందన్నారు. రైస్ కూడా ప్రపంచవ్యాప్తంగా 0.5 శాతం ఉత్పత్తి తగ్గిందన్నారు. కానీ దేశంలో బియ్యం ఉత్పత్తి వంద శాతం పెరిగిందని, తెలంగాణ రాష్ట్రం నుంచే ఆ పెంపు జరిగిందని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు.
వంద శాతం రైస్ ఉత్పత్తి పెరిగినా, దాన్ని కేంద్ర ప్రభుత్వం కొనడంలేదన్నారు. రైతుల నుంచి బియ్యం కొనకపోవడం వల్లే, తెలంగాణ రైతులు చింతిస్తున్నారని నామా ఆరోపించారు. రైతులు దుఖ్కిస్తున్నారని అన్నారు. దేశంలో అన్నం పెట్టే శక్తి రైతులకు మాత్రమే ఉందన్నారు.
ధరలపెరుగుదలపై వై ఎస్ ఆర్ సి పి ఎంపి మార్గాని భారత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో ఓ వైపు ధరలు పెరుగుతుంటే మరో వైపు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : జీఎస్టీ రేట్లకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఆందోళన