Corporate Divorces: మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెల్! కానీ అది హెల్ అని తెలిసేంతదాకా ఒక మైకం ఆవరించి ఉండడం వల్ల హెవెన్ లా అనిపిస్తుంది. హెవెన్లో అయినా ఒవెన్ ఉక్కపోతలు, అట్టుడికిపోవడాలు ఉంటాయి. మావిడాకులు కట్టిన మా గుమ్మాల్లో మా విడాకులు విడి విడిగా కట్టుకున్నామని ట్విట్టర్లలో ట్విట్టే దాకా వారు హెవెన్ లాంటి హెల్లో ఉన్నారని మనం అనుకోవాలి. వారి గోప్యతను గౌరవిస్తూ మనం గమ్మనుంటే…హెల్లో ఉన్నా వారికి విడి విడి హెవెన్లలో ఉన్నట్లే ఉంటుంది.
అనుబంధాలు, భవ బంధాలు తెంచుకుని వెళ్లలేని కోట్లమందికి అసూయ కలిగే ఎన్నో విడాకులు ఎగెరెగిరి మొహం మీద పడుతుంటాయి. కొందరు ఆశ్చర్యపోతారు. కొందరు ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందే అని అనుకుంటారు. కొందరికి ఈ విడాకులు దారులు కూడా చూపవచ్చు.
ప్రేమలు చిగురించి, మొగ్గ తొడిగి, కాయ కాచి, పెళ్లయి, కడుపు పండి, పిల్లా జెల్లలతో కళకళలాడుతున్న ఇళ్లల్లో ఆకులు విడిగా వేయడానికి వారి కారణాలు వారికి ఉంటాయి. వారి గోప్యతను గౌరవిస్తూ…వారి తరపున మనమే బాధపడదాం. వారికోసం మనమే ఏడుద్దాం. వారిని అడగలేని ప్రశ్నలను మనలో మనమే వేసుకుని…సమాధానాల కోసం జుట్లు పట్టుకుందాం.
ఎంగేజ్మెంట్ పెటాకులు
భూమ్యాకాశాలు ఒక్కటయ్యేలా ఎంగేజ్మెంట్ జరిగింది. ముందు అడ్డురాని వయసు…ఎంగేజ్మెంట్ ఉంగరం తొడగ్గానే అడ్డొచ్చింది. ముందు అడ్డురాని కులం…ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వార్తల ప్రింట్ తడి ఆరకముందే అడ్డొచ్చింది.
పెళ్లి పెటాకులు
కులం, మతం అడ్డు గోడలు దాటి ప్రేమలు పెనవేసుకుని పెళ్లి పీటలెక్కాయి. పిల్లలు పుట్టక ముందే హాయిగా విడిపోయి ఎవరి సుఖం వారు వెతుక్కోవాల్సి వచ్చింది.
రెండో పెళ్లి పెటాకులు
మొదటిది తొందరపాటు. రెండోది గ్రహపాటు.
మూడో పెళ్లి పెటాకులు
ఒక పెళ్లి పెద్దలు చేస్తే కుదరలేదు. రెండో పెళ్లి వాళ్లే చేసుకుంటే నిలబడలేదు. మూడో పెళ్లి ముళ్లు పట్టు సడలకుండా భగవంతుడే పట్టుకుని ఉన్నాడు.
సంతాన సందేహాలు
మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలతో క్లోజ్ గా ఉండకపోయినా…మూడో భార్య పిల్లలను ఎత్తుకుని తిరుగుతున్నారు. వయసు పెరిగితే తమకు కూడా ఆ ఔదార్యం అబ్బుతుందని…విధి వశాత్తు నాలుగో భార్యకు సంతానం కలిగితే ఆ పిల్లలను ఎత్తుకుని తిరిగే అధికారం తమకే ఇవ్వాలన్న రెండో భార్య పిల్లల డిమాండు సహేతుకమయినదే అని ఒప్పుకున్నవారున్నారు.
జగమంత కుటుంబం
ఒక కుటుంబమే అనేక కుటుంబాలుగా వృద్ధి పొంది పెళ్లి పేరంటాల్లో ఆ కుటుంబమే జగమంత కుటుంబంగా కనిపిస్తోంది. ఆ వేదిక మీద అటు ఇటు తిరిగే అనేక మంది పిల్లల్లో ఒకే పోలికలు కనిపిస్తున్నాయి.
ఆదర్శాల ప్రవచనాలు
ఇల్లు లేదా? వాకిలి లేదా? కార్లు బంగ్లాలు లేవా? డబ్బుల్లేవా? వయసు లేదా? మరి అన్నీ ఉన్నా లేనిది ఏమిటి? ఆదర్శాల ప్రవచనాలు చేసే గొప్పవారు ఎందుకు విడిపోతున్నారు?
అందరికీ తెలిసినా ఎవరూ మాట్లాడుకోకూడని ఇతరేతర వివాహేతర సమస్యలేవో ఉంటాయి. పెద్దల పెళ్లి వారిష్టం. పెద్దల పెళ్లి పెటాకులు కూడా వారి వ్యక్తిగతం. పబ్లిక్ లోకి వచ్చి రోజూ భాష్యాలు చెబుతుంటారు కాబట్టి వారి విషయాలన్నీ పబ్లిక్ ఇంట్రెస్టు విషయాలే అవుతాయి.
తమిళ తెర మీద అతిపెద్ద విడాకుల కథలో కనిపించని కోణాలెన్నో?
తెలుగు తెర మీద కూడా అతుక్కున్న అతుకులబొంత బంధమొకటి మళ్లీ విడిపోవడానికి సిద్ధంగా ఉందని వార్త.
పునరపి కళ్యాణం…
పునరపి అనుమానం…
పునరపి అవమానం…
పునరపి వైరాగ్యం…
పునరపి బంధమోచనం…
పునరపి సమ్మోహనం…
పునరపి కళ్యాణం …
పునరపి అమంగళం…
ఇక సంసారే బహు విస్తారే!
కృపయా పాహి విడి విడి విస్తరే!!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : దయ్యాల్లేవన్నది ఎవరు?