Don’t make it: పోలవరం నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులూ పెండింగ్ లో లేవని, అన్నిఅంశాలూ పరిశీలించాకే అనుమతులు వచ్చాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్. ఆర్. ఎల్.) 45.72 మీటర్లుగా క్లియరెన్స్ వచ్చిందని గుర్తు చేశారు. ఈ లెవల్ వరకూ పోలవరం డ్యాం లో ఏయే ప్రాంతాలు ప్రభావితం అవుతాయో అంచనా వేసి, ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో విలీనం చేసిందని రాంబాబు గుర్తు చేశారు.
ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో వరద వచ్చిందని, దీని ఆసరాగా పోలవరంపై మరో వివాదానికి తెర తీయవద్దని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు రాంబాబు సూచించారు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని తేల్చి చెప్పారు. తెగిపోయిన వివాదాలను మళ్ళీ రేపడం సరికాదని, దేనికోసం ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సిడబ్ల్యూసి సూచనల ప్రకారమే తాము ముందుకెళుతున్నామని, మొన్న కాఫర్ డ్యాం ఎత్తు పెంచినప్పుడు కూడా అవసరమైన అన్ని అనుమతులూ తీసుకున్నామని వివరించారు.
తెలుగు ప్రజలుగా అందరం కలిసి మెలిసి జీవించవలసిన వాళ్ళమని, అనవసర వివాదాలు రేకెత్తించి ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసర అపోహలు సృష్టించడం మంచిది కాదని రాంబాబు అన్నారు. పోలవరం విషయంలో వారు లేవనెత్తిన అంశాల్లో లాజిక్, రీజన్, ధర్మం ఉంటే వాటిని పరిష్కరించడానికి రాజ్యంగబద్ధ సంస్థలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సి డబ్ల్యూసీ లాంటి సంస్థలు ఉన్నాయని, అంటే లేనిపోని వ్యాఖ్యలు చేసి రెండు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణాన్ని చెడగొట్టవద్దని హితవు పలికారు. ఇలాంటి వివాదాల వల్ల రాజకీయంగా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని అంబటి అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని, ఇంకా ఏవైనా అంశాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అంటే కానీ మీడియా ముందు కొచ్చి ప్రజల మధ్య అపోహలు ఏర్పడేలా మాట్లాడడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.