WI Stunning Win: ఐసిసి మహిళా వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో వెస్టిండీస్ మూడు పరుగులతో ఆతిథ్య దేశం న్యూజిలాండ్ పై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. మౌంట్ మంగనూయిలోని బే ఓవల్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో కివీస్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ మహిళలు 16 వద్ద తొలి వికెట్ కోల్పోయారు. ఓపెనర్ దొట్టిన్ 12 పరుగులకే ఔటైంది. వన్ డౌన్ లో వచ్చిన కేసియా నైట్ కూడా ఐదు పరుగులకే పెవిలియన్ చేరింది. ఈ దశలో మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్, కెప్టెన్ టేలర్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 66 పరుగులు జోడించారు. మాథ్యూస్ 128 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ తో 119 పరుగులు చేసి జేస్ కెర్ర్ బౌలింగ్ లో ఔటైంది. కీదియన్ నేషన్ -36; కాంప్ బెల్లె-20; టేలర్-30 పరుగులు చేశారు. విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో తహుహు మూడు; జెస్ కెర్ర్ రెండు; హన్నారో, అమేలియా కెర్ర్ చెరో వికెట్ పడగొట్టారు.
260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ స్కోరు 14 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సుజీ బేట్స్ (3) రనౌట్ అయ్యింది. మంచి ఫామ్ లో ఉన్న అమేలియా కెర్ర్ (13) కూడా త్వరగా పెవిలియన్ చేరింది. ఈ దశలో మరో ఓపెనర్, కెప్టెన్ సోఫీ డేవిన్ , అమీ సత్తార్ వైట్ తో కలిసి మూడో వికెట్ కు 76పరుగులు జోడించారు. సోఫీ సెంచరీ (108 పరుగులు, 127బంతులు, 10ఫోర్లు) చేసి ఔటైంది. చివర్లో మాటీ కార్టిన్ (44); జేస్ కెర్ర్ (25) పరుగులతో రాణించారు.
చివరి ఓవర్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో దొట్టిన్ బౌలింగ్ కు దిగింది. మొదటి బంతికి కివీస్ సింగిల్ సాధించింది. రెండో బంతికి కార్టిన్ ఎల్బీగా ఔటైంది, మూడో బంతికి మరో పరుగు లభించింది. నాలుగో బంతికి జెస్ కెర్ర్ ఔటైంది. ఐదో బంతికి ఫ్రాన్ జోన్స్ రనౌట్ కావడంతో కీవీస్ ఓటమి పాలైంది. విండీస్ బౌలర్లలో దీంద్ర దొట్టిన్, అనిశ మొహమ్మద్,హేలీ మాథ్యూస్ తలా రెండు; చిన్లీ హెన్రీ, షకీర సేల్మాన్ చెరో వికెట్ పడగొట్టారు.
సెంచరీ సాధించడంతో పాటు రెండు వికెట్లు తీసుకున్న హేలీ మాథ్యూస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.