Book on Media Moghul: లేనిది ఉన్నట్టు రాసినా, ఉన్నది లేనట్టు రాసినా శైలిని బట్టి అది సాహిత్యం జాబితాకి చేరే వీలుంది. ఇలాటి నేత పనికి పోకుండా తిన్నగా ఉన్నది ఉన్నట్టుగానే రాస్తే నయం అని సీనియర్ జర్నలిస్టు, రచయిత గోవిందరాజు చక్రధర్ శ్రద్ధతో కూడిన ఓపిక చేసుకుని ‘ఈనాడు’ రామోజీ రావు గారి గురించి పుస్తకం రాసి మనముందుకు తెచ్చారు. సరికొత్త తరం జర్నలిస్టులకు ఇదంతా ఉన్నట్టో లేనట్టో తెలియక తికమకపడకండా వుండేందుకు అనేకానేక సాక్ష్యాధారాలతో, ఇంటర్వ్యూలతో ఒక మంచి నివేదికను జీవితకథ వలె తయారు చేశారు రచయిత. అలాగని ‘30 రోజుల్లో రామోజీ కావడం ఎలా‘ అనే కిటుకు ఈ పుస్తకంలో లేదు.
‘జనం చూసేది మనం చేయవలెనా, మనం చేసేది జనం చూడవలెనా‘ అనేపాత సందిగ్ధావస్థ రామోజీకి వుండదు గనుక ఒక పత్రిక బదులు ‘ఒకే ప్రతిక‘గా ‘ఈనాడు‘ను తెచ్చిపెట్టారాయన. అది పొద్దుటే మన వాకిట్లో పడేట్టు జరిగే సర్వకాల విశేష దృశ్యాలను, భోగట్టాను 370 పేజీల మేర చదువరి తెలుసుకోవచ్చు. ‘తదితర పత్రిక‘లకు ‘ఈనాడు‘కు, రామోజీగారికీ గల తేడాలు, వాటి వెనక యంత్రాంగం, మంత్రాంగం, యాంత్రికత బోలెడు కనిపిస్తూంది, చక్రధర్ సీనియర్ విద్యార్థులకు జర్నలిజం బోధించిన అనుభవం గట్టిది గనుకనూ ఈ పుస్తకంలో ప్రతి శీర్షిక, ఉప శీర్షిక సూటిగా వెళ్ళి పక్షి కనుగుడ్డుకే తగిలే బాణంలా పెట్టారు. అక్కరలేని స్టేషన్ లో ఆగని రైలు వలె, నడక, శైలీ చక్కగా కనిపిస్తుంది. దొంగతనమో, దొరతనమో ‘క్లూ‘ ఇచ్చే సి.సి. కెమెరా వంటి దృష్టితో, పఠనీయమయిన నిజనిర్థారణ కమిటీ తుది నివేదికవలె తయారుచేశారు ఈ పుస్తకాన్ని. అభియోగాలు, అభినందనలూ సమంగా చేర్చి నేటి వారికి నిన్నటి తలుపు తెరచి, నేటి వాస్తవ దృశ్యం చూపెట్టే శ్రమ పూర్తిగా పడ్డారు రచయిత.
చిన్న, చితకా ప్రతి పత్రికా పుట్టడానికి, ‘ప్రకటన‘ల ప్రాణం పోసుకుని మనగలగటానికి, శాప, కోప, తాపాలకు బలయినా బలవంతాన నిలిచే సాధనమున సమకూరు అనుభవాల పుట్టలు బోలెడన్ని వుండకమానవు. అలాగే పెద్ద పత్రికలూనూ. అమృతాంజనమో, ఆంధ్రపత్రికో అన్న సమస్య లేకుండా బతికినన్నాళ్ళు బట్టకట్టిన తీరు వెనక తిప్పలు వుండకమానవు గదా. అన్ని పత్రికలూ అంతే. వీటిలో ప్రతి చిన్న ఘట్టం చిన్నపాటి చరిత్ర అవుతుంది – యజమానులకు, ఉద్యోగులకూ. సినిమా ఏదయినా ఎలా ఉన్నా గాని దాని నిర్మాణ క్రమంలో నటీనట్టులూ బోల్టులూ ఎదుర్కొనే చిత్రవిచిత్రాలు, వెర్రిముచ్చటలూ, డబ్బు చేసే గోలా లోపలివారిని, బయటివారినీ ఆకర్షిస్తాయి. అదేదో ఘనచరిత్రలా లోనివారు, అన్యకాలక్షేపం లేని ప్రేక్షకులూ భావించడమూ సహజం. ఇదే పత్రికలకూ వుంటుంది. మనుషులు, పత్రికలూ సర్వత్రా, సదా తిన్నగా వుండవు. అధవా అలా ఉన్నా రాజకీయ శక్తులు పొగ పెట్టి యాగీ చేస్తాయి కదా.
పెద్దలయిన ప్రముఖ సంపాదకులు, ఇతర ఎడిటోరియల్ బృందం, పెద్ద విలేకరులనూ మినహాయిస్తే ఉత్పత్తి కథ ఒకటే! పని చేసే చోట వివిధ తలనొప్పులు అదనపు విలువలుగా బయట ప్రచారం అవుతోంటాయి. ఉద్యోగులేమో సాధకబాధకాలను ‘‘ఆరోజులే వేరు‘‘ కింద చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ వుంటారు. సహజం. అలా కాసిని సంవత్సరాలు రాగానే ఈ కథలు వినేవారికి అప్రస్తుతాలు, అనవసరాలూ కాబోతుండగా, ఉద్యోగులకు అదో ఘన చరిత్ర, వారి నిర్వాకం మహనీయంలాగా కాలక్షేపం సన్మానాలతోపాటు జరుగుతుండటంలో వింతే లేదు. అసలు ఇదంతా పాఠకులకు ఎంత ముఖ్యమన్నది గాక వేరే కోణంలో చూడటం ఒక జిజ్ఞాస. అందుకే ఈ పుస్తకం చదవటం అవసరమే.
మీరు పుస్తకం చదివి రామోజీ కాదలచినా, ఉండవల్లి కాదలచినా, వారి కబుర్లు, స్టేట్ మెంట్లూ కలగలిపి పరీక్ష నాళికలో వేసి ఏసిడ్ టెస్టు పెట్టదలచిన వారికి ఈ పుస్తకం మరింత ఉపయుక్తంగానూ వుంటుంది. బుర్రలో చిన్న బాక్స్ ఐటమ్ గా వెలుగుతుంది. ఇది అంతా చదువరి చూపుని బట్టి, దాని ఆరోగ్యాన్ని బట్టీ! పుస్తకం కోసం పెద్ద శ్రమే పెట్టుకున్న చక్రధర్ అభినందనీయులు.
– శివాజీ తల్లావజ్ఝల
(వెల రూ. 300… ప్రతులకు గోవిందరాజు చక్రధర్, ఫోన్ నెంబర్- 98498 70250)
ఇవి కూడా చదవండి: